న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాని, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనపడుతోంది. ఎంపీలు అడిగే ప్రశ్నలకు మంత్రులు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా పొంతనలేని జవాబులు చెప్పడం రివాజుగా మారింది. కీలక ప్రశ్నలకు పూర్తి సమాచారాన్ని ఇవ్వని కొందరు మంత్రులు అరకొర వివరాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలైతే చెత్తబుట్టల్లోకి వెళ్లిపోతున్నట్లు పలువురు ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ పథకం కింద కేంద్ర విద్యా శాఖ రూ. 1,000 కోట్ల నిధులు ఇస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ) ఈ నిధులను వినియోగించుకుందా, ఉపయోగించుకుంటే ఏఏ పనుల కోసం వీటిని వాడారో వివరాలు అందచేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఆగస్టు 11న లోక్‌సభలో ప్రశ్నవేశారు. దీనికి విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఇచ్చిన జవాబులో బీహెచ్‌యూకి నిధులు ఇచ్చిందీ లేనిదీ, ఖర్చు చేసిందీ లేనిదీ వంటి వివరాలు చెప్పకుండా ఆ పథకం పుట్టుపూర్వోత్తరాలు గురించి మాత్రమే చెప్పడం గమనార్హం. ఎంపీలు అడిగే ప్రశ్నలకు మంత్రులు అసంపూర్ణ జవాబులు చెప్పడం పరిపాటిగా మారిందని రాయ్ విలేకరులకు తెలిపారు.
సీపీఐ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాలలో ఆర్ఎస్ఎస్ గురించి ప్రభుత్వ నిర్వచనం ఏమిటి, ఆ సంస్థ కార్యకలాపాలు ఏమిటని ప్రశ్న అడిగారు. ఇది సాంస్కృతిక శాఖ పరిధిలోకి వచ్చే అంశం. అయితే ఈ ప్రశ్నను పార్లమెంట్ విభాగం తిరస్కరించింది. ఇక సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ జరిపిన కాల్పులలో ఎంతమంది భారత పౌరులు మరణించారని ప్రశ్నించగా ఇది కూడా తిరస్కరణకు గురైంది. చాలా అల్పమైన కారణాలతో తమ ప్రశ్నలను పార్లమెంట్, సంబంధిత శాఖలు తిరస్కరిస్తున్నట్లు బ్రిట్టాస్ తెలిపారు.
2024 మార్చి 31 వరకు గడచిన ఐదేళ్లు, 2024-25 ఆర్ఙక సంవత్సరంలో మొదటి త్రైమాసికం వరకు ఫ్లెక్సీ ఫేర్, తత్కాల్, ప్రీమియం తత్కాల్, టికెట్ల రద్దు రూపాలలో రైల్వేలకు ఎంత ఆదాయం వచ్చిందని 2024 డిసెంబర్ 13న బ్రిట్టాస్ ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. దీనికి రైల్వే మంత్రి జవాబిస్తూ 2018-19 నుంచి 2022-23 మమధ్య కాలంలో ఫ్లెక్సీ ఫేర్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ రూపాలలో రైల్వేలకు వచ్చిన ఆదాయం పాసింజర్ సర్వీసులలో వచ్చిన మొత్తం ఆదాయంలో దాదాపు 5 శాతం అని తెలిపారు. ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలు చెప్పకపోవడం విచిత్రమని బ్రిట్టాస్ వ్యాఖ్యానించారు.