స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని మండిపడ్డాయి. ఈ ఉదంతానికి ముందు నుంచే బ్రిటన్ పర్యటనలో రాహుల్ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు సభను స్తంభింపజేస్తున్నారు. తన వ్యాఖ్యలపై సభలో వివరణ ఇచ్చే హక్కు తనకు ఉన్నది. మాట్లాడే అవకాశం ఇవ్వాలని రాహుల్ గొంతు చించుకొని అరిచినా పాలకపక్షం పట్టించుకోలేదు, కనీసం ఆయన చెప్పేది కూడా వినకుండా అడ్డుకొన్నది. క్షమాపణ చెప్పాలని రాహుల్‌ను డిమాండ్ చేస్తూనే, ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేయటంపై కాంగ్రెస్‌తో విభేదించే పార్టీలు కూడా తప్పుపట్టాయి. ఇదేనా బీజేపీ మార్క్ ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించాయి.
అదానీ అంశంపై జేపీసీ వేయాలని ప్రతిపక్ష పార్టీలన్నీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌పై సభలో చర్చ జరగకుండా బీజేపీ సభ్యులు ‘రాహుల్ క్షమాపణ’ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో పార్లమెంట్ వెలుపల నిరసన తెలియజేయాలని విపక్ష ఎంపీలు నిర్ణయించుకోగా, మానవహారం చేపట్టకుండా కేంద్రం అడ్డుకోవడంపై ఆ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. చట్టసభలలో విపక్షాలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోవడంతో 14 పార్టీలు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దర్యాప్తు సంస్థలను ఏ విధంగా కేంద్ర సర్కార్ దుర్వినియోగం చేస్తున్నది? ఈడీ చట్టాలను తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకున్నదో.. ఈ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయక తప్పలేదు.
అదానీ అంశంలో హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేయాలని ఈడీని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లేఖను ఈడీ డైరెక్టర్‌కు అందజేసేందుకు 17 విపక్ష పార్టీలు ర్యాలీగా బయలుదేరాయి. అయితే విపక్షాల ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వినతి పత్రం ఇచ్చే హక్కును కూడా కేంద్రం అడ్డుకోవడం ఏమిటి? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అని విపక్షాలు నిలదీశాయి.