న్యూఢిల్లీ, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడం పట్ల ప్రతిపక్షాలు.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది అమరవీరుల జ్ఞాపకాలను, స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని అగౌరవపర్చడం, అధికారాన్ని పట్టుకుని వేళ్లాడటానికి చేసిన తీవ్రమైన ప్రయత్నమని విమర్శించాయి. ఇది రాజ్యాంగ, లౌకిక, గణతంత్ర విలువల ఉల్లంఘన అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఇది వచ్చే నెలలో 75వ పుట్టిన రోజు జరుపుకోబోయే మోదీ ఆర్ఎస్ఎస్ను బుజ్జగించే ఉద్దేశపూర్వక ప్రయత్నం తప్ప మరేమీ కాదని అన్నారు.
2024 జూన్ 4 తర్వాత జరిగిన పరిణామాలతో బలహీనుడైన మోదీ ఇప్పుడు సెప్టెంబర్ తర్వాత తన పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి మోహన్ భాగవత్ పూర్తి దయ, కరుణపై ఆధారపడ్డారని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని ఆర్ఎస్ఎస్ను మోదీ ప్రశంసించడాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి బేబీ తప్పుబట్టారు. మత హింస, అల్లర్లకు సంబంధించి ఆ సంస్థకు ఉన్న చరిత్రపై చారిత్రక పత్రాలున్నాయని, గాంధీ హత్య తర్వాత ఆ సంస్థను నిషేధించిన విషయాన్ని మరువరాదని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ను పొగడ్తలతో ముంచెత్తడం మన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆయన విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం అంటే చరిత్రను వక్రీకరించే వేదిక కాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కే ఝా అన్నారు. ఆర్ఎస్ఎస్ను పొగడటం అంటే స్వాతంత్య్ర పోరాటాన్ని అవమానపరచడమేనని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.