e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News బీజేపీ విముక్త యూపీ

బీజేపీ విముక్త యూపీ

  • ఎస్పీలో చేరి నేనే శంఖం పూరిస్తున్నా
  • బీజేపీ పతనం నా రాజీనామాతో మొదలు
  • మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య
  • అఖిలేశ్‌ సమక్షంలో ఎస్పీలో చేరిక
  • ఎస్పీలోకి సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలు
  • రేపు చేరనున్న దారాసింగ్‌, మరికొందరు!

లక్నో, జనవరి 14: బీజేపీ పతనానికి కౌంట్‌ డౌన్‌ తన రాజీనామాతోనే మొదలైందని ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి, ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరడం ద్వారా బీజేపీ పతనానికి శంఖం పూరిస్తున్నానని పేర్కొన్నారు. స్వామి ప్రసాద్‌ మౌర్య శుక్రవారం ఎస్పీలో చేరారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ యూపీ ప్రజల కండ్లల్లో దుమ్ముకొట్టి దోపిడీకి తెగబడిందని ఆరోపించారు. ప్రజలను పక్కదారి పట్టించిందని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి యూపీ ప్రజలు దోపిడీ నుంచి, ఆ పార్టీ నుంచి విముక్తులు కావాలని పిలుపునిచ్చారు. మౌర్యతో పాటు బీజేపీ విధానాలు నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చిన మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలు భగవతి సాగర్‌, రోషన్‌లాల్‌ వర్మ, వినయ్‌ శాక్య, బ్రిజేశ్‌ ప్రజాపతి, ముకేశ్‌ వర్మలు కూడా ఎస్పీలో చేరారు. అప్నాదళ్‌(సోనేలాల్‌) ఎమ్మెల్యే అమర్‌ సింగ్‌ చౌదరి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేలు నీరజ్‌ కుశావహ మౌర్య, బలరాం సైనీ, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ హర్పాల్‌ సైనీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌, మాజీ మంత్రి విద్రోహీ మౌర్య తదితరులు ఎస్పీలో చేరారు. ఇప్పటికే విశేష ప్రజాదరణ లభిస్తున్న అఖిలేశ్‌కు, ఆయన పార్టీకి తాజా చేరికలు మరింత బలాన్ని చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బలమైన ఓబీసీ నేతల చేరికతో ఎస్పీకి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. నాన్‌ యాదవ్‌ ఓబీసీ ఓటు బ్యాంకు ఈసారి ఎస్పీ వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, యోగి క్యాబినెట్‌కు రాజీనామా చేసిన దారాసింగ్‌ చౌహాన్‌ ఏ పార్టీలోనూ చేరలేదు. చౌహాన్‌తో పాటు మరికొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం ఎస్పీలో చేరుతారని సమాచారం.

- Advertisement -

దళితుల ఇంట్లో యోగి భోజనం
తమ పార్టీ నుంచి బయటికి వెళ్లిన కీలక నేతలు శుక్రవారం ఎస్పీలో చేరుతున్న సమయంలోనే సీఎం యోగి గోరఖ్‌పూర్‌లో దళితుల ఇంట్లో భోజనం చేశారు. ఎస్పీ హయాంలో యూపీలో సామాజిక న్యా యానికి బదులు ‘సామాజిక దోపిడీ’ ఉండేదన్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నదన్నారు.

పెద్ద విషయమేం కాదు
ముగ్గురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడి వెళ్లిపోవడాన్ని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తేలిగ్గా కొట్టిపారేశారు. యూపీ, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కాగా, అఖిలేశ్‌ యాదవ్‌ ర్యాలీకి హాజరైన ఎస్పీ కార్యకర్తలపై లక్నో పోలీసులు కేసులు నమో దు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీకి నేరు గా హాజరైనందుకు దాదాపు 2,500 మందిపై కేసులు నమోదు చేసినట్టు లక్నో సీపీ చెప్పారు.

బీజేపీకి మూడు సీట్లు కూడా రావు
సమాజ్‌వాదీ, అంబేద్కర్‌వాదీ కలిశారు
సైకిల్‌ను ఆపడం ఎవరి తరం కాదు
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌

సమాజ్‌వాదీ పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానిస్తూ ఆ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీ, సీఎం యోగిపై నిప్పులు చెరిగారు. యూపీలో బీజేపీ వికెట్లు ఒకటి తర్వాత ఒకటి టపటపా రాలుతున్నాయన్నారు. యోగికి వికెట్లు ఎలా కాపాడుకోవాలో తెలియదని, క్రికెట్‌ ఆడటం రాదన్నారు. యూపీలో నాలుగింట మూడొంతుల సీట్లు (300కు పైగా సీట్లు) గెలుస్తామన్న బీజేపీ ప్రకటనలను ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడు, నాలుగు సీట్లు కూడా రావన్నారు. ‘స్వామి ప్రసాద్‌ మౌర్య ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నమాట నిజమే. ఈసారి ఆయన చాలా మంది నేతలను తనతో పాటు తీసుకొచ్చారు. ఈ సారి ఎస్పీ అధికారంలోకి వస్తుంది’ అని అఖిలేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘సైకిల్‌ చాలా బలంగా ఉంది. సమాజ్‌వాదీ, అంబేద్కర్‌వాదీ కలిసి సైకిల్‌పై వస్తున్నారు. ఆపడం ఇక ఎవరి తరమూ కాదు’ అన్నారు. 80 శాతం మంది ఓ వైపు, 20 శాతం మంది మరోవైపు మద్దతు ఇస్తారంటూ గతంలో యోగి ఆదిత్యనాథ్‌ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అఖిలేశ్‌ తిప్పి కొట్టారు. ‘80% మంది మద్దతిచ్చేది మాకే. బీజేపీకి 20శాతం మందే ఓట్లేస్తారు. మౌర్య వచ్చిన తర్వాత ఆ 20 శాతం ఓట్లను కూడా బీజేపీ కోల్పోయింది’ అన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement