Waqf Act | న్యూఢిల్లీ, ఆగస్టు 8: మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం ద్వారా మరో వివాదానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డుల అధికారాలు, వాటి పనితీరులో మార్పులు చేస్తూ వక్ఫ్ చట్టం 1995కు ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. లోక్‌సభలో గురువారం మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సవరణలను ప్రతిపాదించారు. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ, పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త బిల్లును తెచ్చారు. 1995 నాటి వక్ఫ్ చట్టానికి దాదాపు 40 సవరణలను ప్రతిపాదించారు. వక్ఫ్ యాక్ట్, 1995 పేరును ‘యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫికసీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, 1995’గా మార్చుతున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.
వక్ఫ్ ఆస్తులను నియంత్రించే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు దఖలుపరిచే విధంగా సవరణలు ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా మహిళలతోపాటు, ముస్లిమేతరులకు వక్ఫ్‌బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో కొంత వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు అంగీకరించింది. కాగా, ముసల్మాన్ వక్ఫ్ చట్టం-1923ను రద్దు చేస్తూ, కేంద్రం మరో బిల్లును సభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ‘వక్ఫ్ చట్టం-1995 వచ్చాక, ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్-1923 దాని ఉనికిని కోల్పోయింది. ఈ చట్టం అవసరం లేదు’ అని అన్నారు.
వక్ఫ్ బిల్లును తీసుకురావటంపై లోక్‌సభలో విపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపాదిత చట్టాన్ని క్రూరమైందిగా పేర్కొన్నాయి. రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించాయి. ఆర్టికల్ 14, 15, 25ను ఈ బిల్లు ఉల్లంఘిస్తున్నదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఇది వివక్షాపూరితమైనదని, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడిచేయడమేనని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులను సంతోషపరిచేందుకు వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు సమాజ్‌వాదీ, ఎన్సీపీ (శరద్‌పవార్ పార్టీ), ఏఐఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. మోదీ సర్కార్ మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. వివిధ రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.
విపక్ష సభ్యుల ఆందోళనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, వక్ఫ్ బిల్లుతో ఏ మత సంస్థ స్వేచ్ఛకూ భంగం వాటిల్లదని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుపై పునఃపరిశీలన కోసం సంయుక్త పార్లమెంట్ కమిటీకి పంపుతూ సిఫారసు చేస్తున్నామని, కేవలం రాజకీయాల కోసమే విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. కేవలం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడితోనే కొంతమంది ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డులు మాఫియా చేతిలోకి వెళ్లిపోయాయని చాలామంది ఎంపీలు తనకు వ్యక్తిగతంగా తెలియజేశారని అన్నారు.
ఇస్లామిక్ చట్టం ప్రకారం కేవలం మతపరమైన లేదా స్వచ్ఛంద సేవాపరమైన కార్యక్రమాల కోసం కేటాయించిన ఆస్తిని వక్ఫ్ అని అంటారు. ఒకసారి ఏదైనా ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించిన తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో రూ.1.2 లక్షల కోట్ల విలువైన తొమ్మిది లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. రైల్వేలు, రక్షణశాఖ అనంతరం దేశంలో అత్యధిక స్థాయిలో భూములున్న మూడో సంస్థగా వక్ఫ్‌బోర్డు నిలుస్తున్నది.
1. వక్ఫ్ చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 40 తొలగింపు: ఏవైనా ఆస్తులు వక్ఫ్ ఆస్తులా కాదా అని నిర్ధారించేందుకు బోర్డుకు అధికారాలు కల్పిస్తున్న సెక్షన్ 40ని తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. 1995 నాటి వక్ఫ్ చట్టానికి 2013లో చేసిన సవరణ ప్రకారం.. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా లేదా?, ఏదైనా ఆస్తి సున్నీ వక్ఫ్‌కు చెందుతుందా లేక షియా వక్ఫ్‌కు చెందుతుందా అని నిర్ణయించే అధికారాన్ని వక్ఫ్‌బోర్డుకు దఖలుపరిచారు. ఇటువంటి కేసులో బోర్డు ముందుగా నోటీసులు జారీచేసి, విచారణ జరిపి, ఆపై సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయంతో విభేదించేవారు ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చు. అక్కడి నుంచి వచ్చేదే తుది తీర్పు.
2. మధ్యవర్తిగా జిల్లా కలెక్టర్: ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే వక్ఫ్ ఆస్తుల ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది. దేశంలోని వక్ఫ్బోర్డులన్నీ తమ పరిధిలోని ఆస్తుల ధ్రువీకరణ, పర్యవేక్షణ కోసం వాటిని జిల్లా అధికార యంత్రాంగం వద్ద రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు సదరు భూమి ప్రభుత్వానిదా లేక వక్ఫ్‌బోర్డుదా అన్న విషయాన్ని తేల్చేందుకు జిల్లా కలెక్టర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. 1995 నాటి చట్టం ప్రకారం ఇటువంటి వివాదాలపై వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకునేది. జిల్లా కలెక్టర్/ మేజిస్ట్రేట్ వక్ఫ్‌బోర్డుల ఆదాయాన్ని పర్యవేక్షిస్తారు.
3. వివాదాస్పద భూముల పునఃధ్రువీకరణ: విదాదాస్పద భూము ల యాజమాన్యం, నిర్వహణపై స్పష్టత వచ్చే విధంగా.. వాటిపై తప్పనిసరిగా పునఃధ్రువీకరణ జరగాలి. ప్రతిపాదిత సవరణ ద్వారా ఏదైనా వక్ఫ్ ఆస్తిపై ఆడిట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. కాగ్ నియమించే ఆడిటర్ ద్వా రా సదరు ఆస్తిని తనిఖీ చేయవచ్చు.
4.వక్ఫ్‌బోర్డులో మహిళలు ముస్లిమేతరులు: కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ర్టాల వక్ఫ్‌బోర్డుల్లో మహిళలకు, ముస్లిమేతరులకు భాగస్వామ్యం. స్టేట్ బోర్డులతోపాటు సెంట్రల్ కౌన్సిల్లో ఇద్దరు మహిళలకు చోటు కల్పించాల్సి ఉంటుంది.
5. బోహ్రాలు, ఆగాఖనీలకు ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డు: ముస్లింలలోని షియా, సున్నీ, బోహ్రా, ఆగాఖని, ఇతర వెనుకబడిన వర్గాల వారికి కూడా బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. బోహ్రాలు, ఆగాఖనీలకు ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటుచేయాలి.