Delhi Airport | దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (Delhi Airport) విమాన కార్యకలాపాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air Traffic Control) వ్యవస్థలో సాంకేతిక సమస్య (Technical Glitch) కారణంగా దాదాపు 800కు పైగా విమానాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. అయితే, సాంకేతిక సమస్య సంభవించిన దాదాపు 36 గంటల తర్వాత ఇప్పుడు విమాన కార్యకలాపాలు క్రమంగా మెరుగుపుడుతున్నాయి. నిన్న 800 విమానాలు ఆలస్యం కాగా.. శనివారం ఉదయానికి ఆ సంఖ్య 129కి తగ్గింది. అందులో 53 విమానాలు ఢిల్లీకి రావాల్సినవి కాగా, 76 విమానాలు ఢిల్లీ నుంచి వెళ్లాల్సినవి ఉన్నాయి.
‘ఏటీసీకి విమానాల రాకపోకల షెడ్యూల్‌ని తయారు చేసే ఆటో ట్రాక్ సిస్టమ్(ఏటీఎస్)కు డాటాను అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్ఛింగ్ సిస్టమ్ (ఏఎంఎస్ఎస్)ను ప్రభావితం చేసిన సాంకేతిక సమస్య క్రమంగా మెరుగుపడుతోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానయాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఏదైనా అసౌకర్యాన్ని తగ్గించేందుకు సంబంధిత అధికారులు పనిచేస్తున్నారు’ అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈ ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్లైట్స్ అప్డేట్ కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 800కి పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రయాణికులు ఐజీఐలో చిక్కుకుపోగా.. ముంబై, బెంగళూరు సహా ఉత్తర భారత్‌లోని లక్నో, జైపూర్, చంఢీగఢ్, అమృత్సర్ సహా అనేక విమానాశ్రయాలు సైతం ప్రభావితమయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయ రన్‌వేపై పార్కింగ్ ప్రదేశం లేని కారణంగా శుక్రవారం సాయంత్రం బయల్దేరాల్సిన పలు విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేశాయి. ఏటీసీకి విమానాల రాకపోకల షెడ్యూల్‌ని తయారు చేసే ఆటో ట్రాక్ సిస్టమ్(ఏటీఎస్)కు ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్ఛింగ్ సిస్టమ్(ఏఎంఎస్ఎస్) డాటాను అందజేస్తూ ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఏటీసీకి విమాన షెడ్యూల్స్ ఆటోమెటిక్‌గా అందట్లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏటీసీ, ఏఎంఎస్ఎస్ వ్యవస్థలో సాంకేతిక సమస్య అని అధికారులు చెప్తున్నప్పటికీ, ఇది సైబర్ దాడి కావొచ్చని వైమానిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏటీసీకి ఆటోమెటిక్ షెడ్యూల్‌ను అందజేసే ఏఎంఎస్ఎస్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు ఏర్పడటం అరుదుగా జరుగుతుందని, ఏదైనా సైబర్ దాడి జరిగితేనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. ఢిల్లీ ఏటీసీపై సైబర్ దాడి జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయని ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ అధికారి పేర్కొన్నారు.
Also Read..
Ajit Pawar | అది ప్రభుత్వ భూమి అని నా కుమారుడికి తెలియదు.. భూ కుంభకోణంపై అజిత్ పవార్
ఢిల్లీ ఏటీసీ క్రాష్!.. ముంబై, బెంగళూరు తదితర ఎయిర్పోర్ట్లపైనా ప్రభావం
వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి