న్యూఢిల్లీ, నవంబర్ 7/(స్పెషల్ టాస్క్ బ్యూరో): అది దేశ రాజధాని ఢిల్లీ. ప్రతి రోజూ వేలాది మంది రాజకీయ నాయకులు, విదేశీ ప్రతినిధులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) దేశంలోనే అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్. అలాంటి విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)పై సైబర్ దాడి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఏటీసీలో శుక్రవారం ఉదయం తలెత్తిన సాంకేతిక సమస్యతో 800కు పైగా విమానాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తలెత్తిన ఈ సమస్యతో ముంబై, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లోని ఎయిర్‌పోర్ట్‌ల విమాన సర్వీసులుపైనా ప్రభావం పడింది. మొత్తంగా వేలాది మంది ప్రయాణికులు గంటలపాటు విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడాల్సి వచ్చింది.

ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 800కి పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రయాణికులు ఐజీఐలో చిక్కుకుపోగా.. ముంబై, బెంగళూరు సహా ఉత్తర భారత్‌లోని లక్నో, జైపూర్, చంఢీగఢ్, అమృత్సర్ సహా అనేక విమానాశ్రయాలు సైతం ప్రభావితమయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయ రన్‌వేపై పార్కింగ్ ప్రదేశం లేని కారణంగా శుక్రవారం సాయంత్రం బయల్దేరాల్సిన పలు విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేశాయి. ఏటీసీకి విమానాల రాకపోకల షెడ్యూల్‌ని తయారు చేసే ఆటో ట్రాక్ సిస్టమ్(ఏటీఎస్)కు ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్ఛింగ్ సిస్టమ్(ఏఎంఎస్ఎస్) డాటాను అందజేస్తూ ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఏటీసీకి విమాన షెడ్యూల్స్ ఆటోమెటిక్‌గా అందట్లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఏటీసీ సిబ్బంది మ్యాన్యువల్‌గా విమానాల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారని, ఫలితంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు పేర్కొన్నాయి.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని విమాన జీపీఎస్ సిగ్నల్స్‌లో గడిచిన వారం రోజులుగా నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియను ‘జీపీఎస్ స్పూఫింగ్’గా పిలుస్తారు. ఈ ప్రక్రియలో విమాన పైలట్లు తప్పుడు నావిగేషన్ సిగ్నల్స్ అందుకోవడం, ల్యాండింగ్ సమయంలో గందరగోళపరిచే హెచ్చరికలు రావడం జరుగుతూ ఉంటుంది. నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించడం, నిజమైన శాటిలైట్ సిగ్నళ్లను అడ్డుకోవడం ఈ స్పూఫింగ్ లక్ష్యం. ఇటువంటి ఘటనలు గడిచిన వారం రోజులుగా ఢిల్లీకి 100 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వర్గాలు వెల్లడించాయి. స్పూఫింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదేనని నిపుణులు చెప్తున్నారు. గత వారం తాను ఆరు రోజులపాటు విధుల్లో ఉన్నప్పుడు అనేకసార్లు తనకు జీపీఎస్ స్పూఫింగ్ ఎదురైందని ఓ పైలట్ వెల్లడించారు. ఓసారి ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో కాక్‌పిట్ సిస్టమ్ మీద ఓ అలర్ట్ మెసేజీ కనిపించిందని.. ముందున్న దారిలో ముప్పు ఉన్నట్లు ఆ అలర్ట్ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. అయితే అటువంటిదేదీ అక్కడ జరగలేదని వివరించారు.
జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదే. నేవిగేషన్ సిస్టమ్స్‌ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు సిగ్నల్స్‌ని ఇది పంపుతూ ఉంటుంది. సాధారణంగా వీటిని శత్రు సేనలకు చెందిన డ్రోన్లు, విమానాలను ధ్వంసం చేయడానికి యుద్ధ రంగంలో ఉపయోగిస్తుంటారు. అయితే, గడిచిన వారం రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలోని ఏటీసీ సిస్టమ్ ఈ స్పూఫింగ్బారిన పడుతున్నది. అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఆధీనంలోని విమానయాన శాఖ ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ, జీపీఎస్ స్పూఫింగ్ సమస్యను ముందుగానే పరిష్కరించి ఉంటే.. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం జరిగిన స్పూఫింగ్.. ఇండో-పాక్ సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల్లో జరిగితే పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన కేంద్రం.. పట్టనట్టు వ్యవహరించడంపై మండిపడుతున్నారు.
ఏటీసీ, ఏఎంఎస్ఎస్ వ్యవస్థలో సాంకేతిక సమస్య అని అధికారులు చెప్తున్నప్పటికీ, ఇది సైబర్ దాడి కావొచ్చని వైమానిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏటీసీకి ఆటోమెటిక్ షెడ్యూల్‌ను అందజేసే ఏఎంఎస్ఎస్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు ఏర్పడటం అరుదుగా జరుగుతుందని, ఏదైనా సైబర్ దాడి జరిగితేనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. ఢిల్లీ ఏటీసీపై సైబర్ దాడి జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయని ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ అధికారి పేర్కొన్నారు.