Operation Sindoor | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మిస్సైళ్లతో మొత్తం 9 పాక్ ఉగ్రస్థావరాలను వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసింది. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తోయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. కోట్లి, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్, చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్లో దాడులకు పాల్పడింది. మురిద్కేలోని లష్కరే తోయిబా, బహవల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ సిందూర్‌ను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. ఇక ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత్ ప్రపంచ దేశాలకు వివరించింది. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి దాడుల సమాచారం తెలిపింది.
అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ. లోపు ఉన్న ఉగ్రస్థావరాలను భారత సైన్యం టార్గెట్ చేసింది. ఈ పరిధిలోనే బహవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో లష్కరే తోయిబా క్యాంపు, సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్ – రాజౌరీకి 35 కి.మీ. దూరంలో ఉన్న గుల్పూరు, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ. పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్, రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ. దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్, రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10 కి.మీ. పరిధిలో ఉన్న బర్నలా క్యాంప్, సాంబా – కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ. దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్, అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ. దూరంలో సియాల్ కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్‌పై మెరుపుదాడులకు పాల్పడింది.