Air Chief | ఆపరేషన్ సిందూర్ దేశ విజయం అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ (Air Chief Marshal AP Singh) అన్నారు. త్రివిధ దళాలు కలిసి ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా అమలు చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి భారతీయుడికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఇదే సమయంలో రక్షణ రంగంలోని కాంట్రాక్టులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం దిల్లీలో జరిగిన బిజినెస్ సమ్మిట్‌లో ఏపీ సింగ్ పాల్గొని మాట్లాడారు. ‘మేము సత్యమార్గాన్ని ఎంచుకున్నాం. దేవుడు కూడా ఇందులో మాకు తోడుగా ఉన్నాడని భావిస్తున్నా. అందుకే ఆపరేషన్ సిందూర్ విజయవంతంమైంది. ఇది దేశ విజయం. ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం నిర్వహించాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి భారతీయుడికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన తెలిపారు.
ఇదే కార్యక్రమంలో రక్షణ రంగంలోని కాంట్రాక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం ఉండవని వ్యాఖ్యానించారు. ఇక్కడ టైమ్‌లైన్ ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తైన దాఖలాలు లేవన్నారు. తేజస్ ఎంకే1 చాలా ఆలస్యమైందంటూ తన అసంతృప్తి వెలిబుచ్చారు. ఇక తేజస్ ఎంకే2 ప్రొటోటైప్ అందుబాటులోకే రాలేదన్నారు. ఇక ఆమ్కా ఫైటర్‌కు సంబంధించి ఇప్పటి వరకు నమూనా విమానం కూడా రాలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎదుటే ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read..
LeT commander | పాక్ నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Spying | పాక్‌కు గూఢచర్యం.. కాంగ్రెస్ నేత మాజీ పీఏ అరెస్ట్