Mock Drills | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్స్ (Mock Drills) నిర్వహించనున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ‘ఆపరేషన్ షీల్డ్’ (Operation Shield) పేరుతో పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్ము కశ్మీర్లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి.
ఇందులో భాగంగా హర్యానాలో రాత్రి 8 గంటల నుంచి 8:15 వరకూ బ్లాక్ అవుట్ నిర్వహించనున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి సైరన్ మోగించనున్నారు. ఇక రాజస్థాన్‌లోని 41 జిల్లాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోనూ నివాస ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ నిర్వహించనున్నారు. అయితే, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని అక్కడి అధికారులు చెప్పారు. ఆ సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైమానిక దాడి సైరన్లు మోగించనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్స్ నిజానికి ఈ నెల 29నే నిర్వహించాల్సి ఉంది. పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఈ డ్రిల్స్‌ను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీల్లో దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అలాగే కశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం ఈ డ్రిల్స్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీ తర్వాత జరిగిన సైనిక ఘర్షణల కాలంలో సరిహద్దు రాష్ర్టాలపైనే పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. కంట్రోల్ రూముల నిర్వహణ, వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును మాక్ డ్రిల్ సందర్భంగా పరీక్షిస్తారు.
Also Read..
Neha Bhandari: బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ నేహా భండారిని సత్కరించిన ఆర్మీ చీఫ్
Covid-19 | దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. రెండు వేలు దాటిన పాజిటివ్ కేసులు
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్న కొలంబియా