న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 263 కేసులు ఉండగా, మహారాష్ట్రలోనే 252, గుజరాత్లో 97, రాజస్థాన్లో 69, కేరళలో 65, తెలంగాణలో 62 కేసుల చొప్పున ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు 320 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాచడంతో దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. కొత్తగా 13,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,22,040కు చేరాయి. ఇందులో 3,42,58,778 మంది వైరస్ నుంచి కోలుకోగా, 82,402 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,80,860 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు.
కాగా, దేశంలో యాక్టివ్ కేసులు 0.24 శాతం ఉన్నాయని, రికరీ రేటు 98.38 శాతమని, మరణాల రేటు 1.38 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా దేశంలో మొత్తం 1,43,83,22,742 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 63,91,282 మందికి టీకా వేసినట్లు తెలిపింది.