పాత పార్లమెంట్ భవనం ఇకపై ‘సంవిధాన్ సదన్’
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత పార్లమెంట్ చరిత్రలో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఎంపీలందరూ కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు. కొత్త భవనాన్ని ‘ద పార్లమెంట్ హౌజ్ ఆఫ్ ఇండియా’గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. పాత పార్లమెంట్ భవనం పేరును ‘సంవిధాన్ సదన్’గా మార్చామని, సమావేశాలు కొత్త భవనంలో ప్రారంభమయ్యాయని చెప్పారు.
దీనికంటే ముందు మంగళవారం ఉదయం పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సభ్యులందర్నీ ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. సభ్యులందరితో ఫొటో సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత సభ్యులంతా నడుచుకుంటూ కొత్త భవనంలోకి ప్రవేశించారు. లోక్సభకు సంబంధించి హౌస్, లాబీ, గ్యాలరీలు అన్న పదాలు కొత్త భవనానికి వర్తిస్తాయని స్పీకర్ ఓమ్ బిర్లా ప్రకటించారు. న్యూఢిల్లీ, ప్లాట్ నెంబర్ 118, దక్షిణాన రైసానా రోడ్డు, ఉత్తరాన రెడ్ క్రాస్ రోడ్డు కలిగివుందంటూ కొత్త పార్లమెంట్ భవనం చిరునామాను నోటిఫికేషన్లో పేర్కొన్నారు.