Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా (Russia) పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన దోవల్.. తాజాగా ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిలిటరీ-సాంకేతిక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది. పౌర విమానాల తయారీ, రసాయన పరిశ్రమ సహా ఇతర వ్యూహాత్మక రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టుల పురోగతిని ఇరుపక్షాలు సమీక్షించినట్లు పేర్కొంది.
కాగా, ఈనెల 7న పుతిన్‌తో దోవల్ భేటీ అయిన విషయం తెలిసిందే. క్రెమ్లిన్ వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో రష్యా భద్రతామండలి సెక్రటరీ సెర్గీ షొయిగు, క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ పాల్గొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లతో భారత్‌పై అమెరికా అధిక సుంకాలు వధించిన వేళ దోవల్ మాస్కో పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
పుతిన్‌తో మోదీ ఫోన్ సంభాషణ..
మరోవైపు రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో స్వదేశంలో భారత్, రష్యా 23వ వార్షిక సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మోడీ.. ఉక్రెయిన్ యుద్ధం పురోగతి విషయమై రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. ‘స్నేహితుడు పుతిన్‌తో సంభాషణ సమగ్రంగా, ఉపయుక్తంగా సాగింది. ఉక్రెయిన్ యుద్ధం తాజా అప్డేట్స్ విషయంలో ఆయనకు ఫోన్లోనే ధన్యవాదాలు తెలియజేశాను.
భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కూడా ఇద్దరం చర్చించాం. అంతేకాదు రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో కట్టుబడి ఉన్నామని పుతిన్‌తో చెప్పాను. ఈ ఏడాది చివర్లో పుతిన్‌ను భారత్‌కు ఆహ్వానించనున్నాను’ అని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై మరోసారి భారత్ తటస్థ వైఖరిని మోడీ స్పష్టం చేశారు. ఇరు దేశాధినేతలు చర్చించుకొని.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ఏడాది చివరిలో భారత్‌కు పుతిన్
పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్‌ను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన తేదీలను ఖరారు చేస్తున్నట్లు మాస్కో పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం వెల్లడించారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయ్గుతో సమావేశమైన ధోవల్ త్వరలో జరగనున్న పుతిన్ భారత పర్యటనపై భారత ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఉందని చెప్పారు.
Also Read..
Pakistan | భారత్ విమానాలకు గగనతలం మూసివేత.. రెండు నెలల్లోనే పాక్‌కు రూ.400 కోట్ల నష్టం