Pakistan | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ (Pakistan)పై భారత్ పలు ఆంక్షలు విధించింది. అందుకు ప్రతిగా పాక్ సైతం భారత్‌ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఆ నిర్ణయాల వల్ల పాక్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని (airspace) మూసివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24 నుంచి భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నిషేధం ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ నిర్ణయం కారణంగా ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 మధ్య పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి రూ.4.10 బిలియన్ల నష్టం (భారత కరెన్సీలో రూ.410 కోట్లు) వాటిల్లింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ అక్కడి అసెంబ్లీలో వెల్లడించినట్లు డాన్ నివేదించింది.
పాక్ ఆంక్షల ప్రభావం రోజుకు 100 నుంచి 150 భారత్‌కు చెందిన విమానాలపై పడింది. దీని ఫలితంగా మొత్తం విమాన రాకపోకల్లో 20 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో అధిక ఛార్జీల నుంచి ఆదాయం తగ్గినట్లు పాక్ మంత్రి అసెంబ్లీకి వివరించినట్లు డాన్ పేర్కొంది. ఈ నిర్ణయంతో రెండు నెలల్లోనే దాదాపు రూ.4.10 బిలయన్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
పాక్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
విమానాలు ఒక దేశ గగనతలం మీదుగా ప్రయాణించినప్పుడు ఆ దేశానికి ‘ఓవర్‌ఫ్లైట్ ఫీజులు’ చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమ దేశాలకు వెళ్లే భారత విమానాలు ఎక్కువగా పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగిస్తుంటాయి. పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు ఏటా మిలియన్ల డాలర్లు ఆ దేశానికి ఓవర్‌ఫ్లైట్ ఫీజుల కింద చెల్లిస్తుంటాయి. దీని ద్వారా పాక్‌కు ఏటా కోట్లాది డాలర్ల ఆదాయం సమకూరేది. తాజా ఆంక్షల వల్ల పాక్‌కు ఈ ఆదాయం నిలిచిపోయింది. దీని ప్రభావం పాక్ ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
పాకిస్థాన్ ఇలా భారత్ నుంచి వచ్చే విమానాలకు తన గగనతలాన్ని మూసివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. జూలై 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అప్పుడు దాదాపు 400 విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఫలితంగా పాక్ 100 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుత చర్యతో పాక్ మరోసారి అలాంటి నష్టాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది.
పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానాలు ఓవర్‌ఫ్లైట్ ఫీజుగా దాదాపు 580 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద విమానాలకు ఈ ఫీజులు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. తాజా నిర్ణయంతో ఓవర్ ఫ్లైట్ ఛార్జీల ద్వారానే పాకిస్థాన్ ప్రతిరోజూ దాదాపు $232,000 మేర నష్టపోతోందని అంచనా. దీనికి తోడు ల్యాండింగ్, పార్కింగ్ వంటి ఇతర ఛార్జీలతో కలిపి రోజువారీ నష్టం దాదాపు $300,000 వరకూ ఉంటుందని అంచనా.
Also Read..