Tariff War | రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. వచ్చీరాగానే టారిఫ్‌ల (Trump Tariff) బాంబు పేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. ఇక మిత్రదేశం అంటూనే భారత్‌పై కూడా పెద్దమొత్తంలో ప్రతీకార సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో న్యూ ఢిల్లీపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లను 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. సుంకాల దెబ్బకు అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్వదేశంలోని నేతలే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
తాజాగా అమెరికా ఆర్థికవేత్త (US Economist), జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ (John Hopkins University Professor) స్టీవ్ హాంకీ (Steve Hanke) కూడా ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని (Tariff War) ప్రారంభించడం ద్వారా తనను తాను నాశనం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధానాలు ‘పూర్తిగా చెత్త’ నిర్ణయంగా అభివర్ణించారు. ‘తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిది అనేది నెపోలియన్ సలహా. కానీ ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.
ఇక ఇదే సందర్భంలో భారత్‌పై విధించిన సుంకాల (Tariff War With India) గురించి కూడా ఆయన ప్రస్తావించారు. టారిఫ్‌ల విషయంలో భారత్ కాస్త ఓపిక పట్టాలని సూచించారు. ‘ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ పేకమేడ త్వరలోనే కూలిపోతుందని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువవుతుందని హాంకీ అంచనా వేశారు.
Also Read..
Donald Trump | వచ్చే శుక్రవారం పుతిన్‌తో సమావేశమవుతున్నా.. డొనాల్డ్ ట్రంప్
మైనారిటీ విద్యార్థులకు ట్రంప్ షాక్.. వారి డాటా కోసం ఆదేశం