వాషింగ్టన్ : అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో బ్లాక్, బ్రౌన్ వర్ణాల విద్యార్థుల ప్రవేశాలను పరిమితం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల జాతి, లింగ, టెస్ట్ స్కోర్, గ్రేడింగ్ పాయింట్లు వంటి వివరాలను విద్యా శాఖకు సమర్పించాలని ట్రంప్ గురువారం ఆదేశాలు ఇచ్చారు. కళాశాలలు మైనారిటీ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయేమో గుర్తించడమే ఈ ఉత్తర్వుల లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి.
విద్యార్థుల జాతిని పరిగణనలోకి తీసుకుని కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే విధానాన్ని సుప్రీంకోర్టు 2023లో కొట్టివేసింది. కానీ విద్యా సంస్థలు ఈ తీర్పును పట్టించుకోవడం లేదని, దానిని అమలు చేయాలని అమెరికన్ సంప్రదాయవాదులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు అనుగుణంగానే ట్రంప్ తాజా ఆదేశాలు ఉన్నాయి. ఇది విద్యా సంస్థల్లో వామపక్ష భావజాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగమేనని కొందరు విమర్శిస్తున్నారు. విద్యార్థుల జాతిని పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పించే విద్యా సంస్థలపై ఈ ఆదేశాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు తెలిపారు.