వాషింగ్టన్: రష్యా, అమెరికా అధ్యక్షుల సమావేశానికి తేదీ ఖరారయింది. వచ్చే శుక్రవారం (ఆగస్టు 15) ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ నెల 15న అలస్కాలో పుతిన్‌తో (Vladimir Putin) భేటీ కానున్నట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా నేను రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా. వచ్చే శుక్రవారం అలస్కాలో ఈ భేటీ జరుగబోతున్నది. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రపంచంలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే తన ఆకాంక్ష. మేము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ చెప్పారు.
2022, ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లో ఆపేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిగాయి. కానీ ఎలాంటి యుద్ధానికి ఎలాంటి ముగింపు లభించలేదు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. కాగా, ట్రంప్‌తో భేటీకి ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్ సంప్రదింపులు జరిపారు.