Women’s Reservation Bill | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తెగ పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో పెరిగిన మహిళల ఓట్ల కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు.. గతంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే విషయంలో కానీ, దాని ఆమోదం విషయంలో కానీ చేసిన కృషి, చూపిన చిత్తశుద్ధి ఏపాటిదో తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. గత రెండు పర్యాయాలుగా అధికారం వెలగబెడుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిదో చరిత్ర చెబుతున్నది. గతాన్ని పక్కనబెడితే, 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది.
అయితే ఆ తర్వాత లోక్సభ అమోదిస్తే, రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం చట్టంగా మారేది. కానీ ఆ తర్వాత 2014 వరకు నాలుగేండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఆ దిశగా కృషి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నించింది తామేనని లోక్సభలో సోనియా గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వాదించారు.
2014 తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు గత 10 ఏండ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీ.. మహిళలకు సాధికారత కల్పించే బిల్లుపై దృష్టి కూడా పెట్టలేదని, ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ బిల్లును పెట్టడం వెనుక ఉన్న ‘ఓట్ల’ వ్యూహం అందరికీ తెలిసిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ పేరిట వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడ అనేది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు.
2019 లోక్సభ ఎన్నికలలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓటింగ్ శాతం 67.01 కాగా మహిళల ఓటింగ్ 67.18 శాతం. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.8 కోట్లు కాగా ప్రస్తుతం 46.1 కోట్లు. ఇదే సమయంలో పురుష ఓటర్లు 2019లో 47.3 కోట్లు కాగా ప్రస్తుతం 49 కోట్లు. మహిళా ఓటర్ల పెరుగుదల 2019 నుంచి 2022 వరకు 5.1 శాతం ఉండగా.. ఇదే వ్యవధిలో పురుష ఓటర్లు 3.6 శాతం మాత్రమే పెరిగాయి. దేశంలో ప్రస్తుతం మొత్తం ఓటర్ల సంఖ్య 95.1 కోట్లు ఉండగా, మూడేండ్ల కిందట ఇది దాదాపు 91.1 కోట్లు. ఓటర్ల పెరుగుదలలో పురుషుల కంటే మహిళ సంఖ్య ఎక్కవగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహిళా రిజర్వేషన్ల అంశాన్ని గెలుపు ఫార్ములాగా భావిస్తూ ఓ పాచికలాగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.