Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఏదైనా నేరంలో దోషిగా తేలిన ఫోర్త్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగిపైనే జీవితకాలం నిషేధం విధిస్తున్నప్పుడు, దోషులుగా తేలిన వారు మళ్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అవడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జైలు శిక్ష పూర్తయిన తరువాత ఆరేండ్ల వరకు మాత్రమే మళ్లీ పోటీ చేయకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం నిషేధిస్తున్నదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ వ్యాజ్యంపై అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5 వేల క్రిమినల్ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పినా ఇప్పటికీ 42 శాతం మంది సిట్టింగ్ లోక్‌సభ సభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటం సిగ్గు పడాల్సిన అంశమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8, 9వ సెక్షన్లపై మరో న్యాయవాది వికాస్ తన వాదనలు వినిపించారు. తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలి 2-3 ఏండ్ల స్వల్పకాల జైలుశిక్షను అనుభవించిన తర్వాత కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వీలు ఈ సెక్షన్ల ద్వారా ఉందని, ఇలా జరుగుతుందని ఈ సెక్షన్లను రూపొందించినప్పుడు పార్లమెంటు అనుకొని ఉండదని పేర్కొన్నారు.
ఈ వాదనలపై జస్టిస్ దీపాంకర్ దత్తా స్పందిస్తూ.. ‘హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలిన క్లాస్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగి మళ్లీ తన ఉద్యోగాన్ని పొందడానికి వీలు లేదు. కానీ, ఒక ఎంపీనో, ఎమ్మెల్యేనో మళ్లీ ఎన్నిక కాగలుగుతున్నారు. మంత్రి కూడా కాగలుగుతున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8, 9వ సెక్షన్లను సమగ్రంగా పరిశీలిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తి కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాగలుగుతున్నాడని, దీనిని నిలువరించాలని పిటిషన్‌దారు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ మన్మోహన్.. ‘ఒక దేశంగా మనం సాధించాల్సిన లక్ష్యం మీది. కానీ, అసమగ్రంగా ఒక నిర్ణయం తీసుకొవద్దు. మనం ఏదైనా లొసుగు వదిలేస్తే, ఆ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదు.
ప్రజలు మరింత విశ్వాసాన్ని కోల్పోతారు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలు నేరమయం కావడం చాలా పెద్ద అంశమని, ఎన్నికల సంఘం ఈ విషయంపై దృష్టి పెట్టి, మెరుగైన పరిష్కారాన్ని గుర్తించి ఉండాల్సిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ వ్యాజ్యంపై మరోసారి స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను మార్చి 4వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.