PM Modi : భారత్ (India) పై అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs) ను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. దేశ ఆర్థికవ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందన్నారు. ఢిల్లీలోని బశోభూమిలో నిర్వహించిన ‘సెమీకాన్ ఇండియా 2025’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్ ఇండియా కోసం భారత్‌కు రావాలని, ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వ పాలనలో భారత్‌లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత లాంటి పలు మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధాని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా అన్నిరంగాల్లో కనిపిస్తోందని అన్నారు. తాము మేడిన్ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్నామని ప్రపంచదేశాలు చెప్పుకునే రోజు త్వరలోనే రానుందని చెప్పారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తంచేశారు.
ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్‌కు ఆదరణ తగ్గలేదని చెప్పారు. భారత్‌పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో మోదీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.