(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అదో ప్రభుత్వ వైద్య కళాశాల. ఏడాది కిందటే తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారో.. స్కూల్లోకి వెళ్లిన భావన కలుగుతుంది. కారణం.. భావి ఆరోగ్య ప్రదాతలను తయారుచేసే ఆ కళాశాల.. ఓ ప్రీ-ప్రైమరీ స్కూల్లో నడుస్తుండటమే. బీజేపీపాలిత మహారాష్ట్రలోని అలీబాగ్ పట్టణానికి సమీపంలో ఉన్న కురూల్ గ్రామంలోని ‘అలీబాగ్ మెడికల్ కాలేజీ’ దుస్థితి ఇది.
నిబంధనల పేరిట కొర్రీ
2010లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అలీబాగ్ మెడికల్ కాలేజీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దశాబ్దకాలంగా పనుల్లో ఎలాంటి పురోగతి జరుగలేదు. రెండేండ్ల కిందట భవనం నిర్మాణానికి శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారు 53 ఎకరాలను కేటాయించింది. రూ. 440 కోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో కిందటేడాది ఎట్టకేలకు కాలేజీ ప్రారంభమైంది. తొలివిడుతలో కొన్ని నిధులను విడుదల చేయగా.. కాలేజీ ప్రహారీ పనులు పూర్తయ్యాయి. అయితే, కొవిడ్-19 కేసులు పెరుగడంతో పనులు అటకెక్కాయి.
ఇంతలో రాష్ట్రంలో వేగంగా మారిన రాజకీయ పరిణామాలతో ఏక్నాథ్ షిండే వర్గంతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కళాశాల నిర్మాణంపై దృష్టిసారించకుండా ప్రభుత్వం ఆ పనులను పక్కకు పెట్టింది. పరిపాలనా నిబంధనలు సరిగ్గా లేవంటూ గత నెల 13న మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కాలేజీ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్)కు చెందిన స్థలంలో.. అక్కడే ఉన్న ఓ ప్రీ-ప్రైమరీ పాఠశాలలోనే ఇంకా ఈ కాలేజీని నడుపుతున్నారు.
పెంకులతో నిర్మించిన గదుల్లో ప్రయోగశాలలను, విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నామని, వర్షాకాలంలో చూరు నుంచి నీరు ధారలుగా కారుతున్నదని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆర్సీఎఫ్ స్టాఫ్‌కు చెందిన క్వార్టర్స్‌ను, హాస్టళ్లను కూడా కాలేజీ అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కాలేజీ నిర్మాణ పనులు పూర్తయ్యేంతవరకూ తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా వసతి సౌకర్యాలను కల్పిస్తారని, అయితే, కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఇకపై ఈ స్కూల్ ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తున్నదని కాలేజీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూర్చోడానికి నాక్కూడా గది లేదు
మెడికల్ కాలేజీ అంటే అనుబంధంగా ఓ దవాఖాన ఉండాలి. అయితే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. సరైన మౌలిక సదుపాయాలు లేవు. అంబులెన్స్‌లూ లేవు. కార్లు, వసతికి ఇండ్లు, హాస్టల్ ఇలా.. ఏమీ లేవు. స్థానిక సివిల్ దవాఖానను మాకు అప్పగిస్తామన్నారు. అయితే, ఇప్పటివరకూ అదేమీ జరుగలేదు. డీన్ అయినప్పటికీ, నాకే ఓ ప్రత్యేక గది లేదు. అలీబాగ్ సివిల్ దవాఖానలోని ఓ గది నుంచి పనులు నిర్వహిస్తున్నా. అయితే, అక్కడ ఉన్న సివిల్ సర్జన్.. నన్ను ఖాళీ చేయమంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీని ఎలా నడుపగలం?’
– డాక్టర్ సంజయ్ సోనోన్, కాలేజీ డీన్, అలీబాగ్ మెడికల్ కాలేజీ