బెంగళూరు, జనవరి 28: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టులు పెద్ద తలనొప్పిగా మారాయి. బోర్డు పదవులు అప్పగిస్తే ‘మాకేం వద్దుపో’ అని అధిష్ఠానానికి తేల్చిచెప్తున్నారు. కొందరైతే ‘మాకు కార్పొరేషన్ పదవులా? ఇస్తే గిస్తే క్యాబినెట్ మినిస్టర్ స్థాయి పోస్టులు ఇవ్వాలి. గీ పోస్టులు మాకెందుకు?’ అని స్పష్టం చేస్తున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హస్తం పార్టీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సరైన సమయం అని.. ప్రతిపక్ష బీజేపీ అదను కోసం చూస్తున్నది.
కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? అని ఓ కన్నేసి ఉంచింది. దీంతో హస్తం పార్టీ పెద్దలకు మరింత తలనొప్పిగా మారింది. ‘ఆపరేషన్ లోటస్’ అంటూ రంగంలోకి దిగితే అసమ్మతి ఎమ్మెల్యేలు జంప్ అవుతారేమోనని తలలు పట్టుకుంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రముఖులే. వీరంతా నామినేటెడ్ పోస్టుల పట్ల అసహనంతో ఉన్నారు. కాగా, జనవరి 26న ఆ రాష్ట్ర ప్రభుత్వం 34 బోర్డులు, కార్పొరేషన్లకు బాస్‌లను నియమించింది. త్వరలో మరో 45 బోర్డులు, కార్పొరేషన్లకు కూడా నియమించేందుకు సిద్ధమవుతున్నది.
నామినేటెడ్ పోస్టులు తీసుకోకపోవటానికి వెనుక పెద్ద కారణం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న డబ్బునంతా తీసుకెళ్లి గ్యారెంటీల అమలుకే ఖర్చు పెడుతున్నది. దీంతో కార్పొరేషన్లకు చిల్లి గవ్వ కూడా రాదని, అలాంటప్పుడు ఇంకెందుకు ఆ పోస్టులు అని తెగేసి చెప్తున్నారు. మరోవైపు, పార్టీ నేతల కామెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుదిబండలా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో యెడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గలో బీజేపీ ఎంపీగా మళ్లీ గెలుస్తారని పార్టీ సీనియర్ నేత శమనూర్ శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి, నష్టాన్ని నియంత్రించే పనిలో పడ్డారు.
ప్రస్తుత కార్పొరేషన్ నియామకాల్లో సీఎం సిద్ధరామయ్యదే పైచేయిగా నిలిచింది. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎలాగైనా సీఎం సీటును దక్కించుకోవాలని చూస్తున్న డీకే శివకుమార్.. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి పార్టీ అధిష్ఠానం ముందు తన బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. ఎన్నికలు ముగిసే వరకు పార్టీలో ముసలాన్ని నియంత్రించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను బీజేపీ దగ్గరుండి గమనిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార కాంగ్రెస్‌ను గద్దె దించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఆపరేషన్ లోటస్ లాంటి ఏ ప్రయత్నాలూ చేయటం లేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర చెప్పటం గమనార్హం. అయితే, రాజకీయ నాయకులు చేసేదేదైనా చెప్తారా ఏంటి? అని కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆ పార్టీని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తున్నది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటంలో విజయేంద్ర కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చాలా రోజుల క్రితమే పని ప్రారంభించి, సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో? అని ఇరు వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.