న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ నమూనాలలో మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన విష పదార్థాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. (No Toxins In Cough Syrup) నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇతర ఏజెన్సీల శాస్త్రవేత్తలు మధ్యప్రదేశ్లోని చింద్వారాను సందర్శించి దగ్గు సిరప్ నమూనాలు సేకరించి పరీక్షించినట్లు పేర్కొంది. అయితే ఏ నమూనాలో కూడా కిడ్నీ వైఫల్యానికి దారి తీసే డైథిలిన్ గ్లైకాల్ లేదా ఇథిలిన్ గ్లైకాల్ లేనట్లు తేలిందని వెల్లడించింది. రాష్ట్ర అధికారులు కూడా ఆయా నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. పిల్లల మరణాలపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
కాగా, పిల్లలకు దగ్గు సిరప్ వాడకాన్ని పరిమితం చేయాలని కేంద్రం సలహా ఇచ్చింది. ముఖ్యంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు దగ్గు, జలుబు మందులు సూచించవద్దని పేర్కొంది. సాధారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారికి దగ్గు సిరప్ మంచిది కాదని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ తెలిపారు. పిల్లల్లో వచ్చే దగ్గు కేసులు ఎక్కువగా మందులు లేకుండానే తగ్గిపోతాయని చెప్పారు. హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక చికిత్సలు అందించాలని అన్నారు.
మరోవైపు మందుల తయారీదారులు ‘మంచి తయారీ పద్ధతులకు’ కట్టుబడి ఉండాలని కేంద్రం తెలిపింది. బహుళ ఔషధ సమ్మేళనాన్ని నివారించాలని సూచించింది. అలాగే ఔషధాల సురక్షిత వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పేర్కొంది.
Also Read:
Bihar Elections | బీహార్లో తుది జాబితా నుంచి.. మహిళా ఓటర్లు రెండింతలు తొలగింపు
Delivery Boy Kidnaps, Rapes Girl | బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన డెలివరీ బాయ్