Dharmendra Pradhan | కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందని ఆ రాష్ట్ర నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి (Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తాజాగా స్పందించారు. ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ (MK Stalin)కు కేంద్ర మంత్రి లేఖ రాశారు.
విదేశీ భాషపై అధికంగా ఆధారపడుతున్న విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఫలితంగా విద్యార్థులకు తమ మూలాలపై అవగాహన తగ్గుతోందన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా ఈ పరిస్థితిని సరిచేసే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. తమకు నచ్చిన భాషను ఎంచుకునే స్వేచ్ఛకు జాతీయ విద్యావిధానం ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉందని గుర్తు చేశారు.
తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి లేఖలో గుర్తు చేశారు. రాజకీయ కారణాలతో జాతీయ విద్యావిధానాన్ని తమిళనాడులోని అధికార డీఎమ్‌కే పార్టీ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. తమిళ సంస్కృతి, భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యావిధానంతో రాజకీయం వద్దని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయమబోమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఈ స్పందన వచ్చింది.
Also Read..
Rekha Gupta | ఒక్కరోజు కాలేదు.. అప్పుడే విమర్శలా..? ఆతిశీకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్
DK Shivakumar | ఆ దేవుడి వల్ల కూడా కాదు.. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యపై డీకే శివకుమార్ వ్యాఖ్య
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?