Rekha Gupta | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీ (Atishi)పై ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే విమర్శలు చేస్తున్నారా..? అంటూ మండిపడ్డారు.
కాగా, ఢిల్లీలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ మాజీ సీఎం ఆతిశీ విమర్శించారు. ఢిల్లీ మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ విమర్శించారు. ఆతిశీ విమర్శలపై సీఎం రేఖా గుప్తా తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కొత్త ప్రభుత్వానికి లెక్చర్ ఇవ్వొద్దని.. బదులుగా తన సొంత పని చూసుకుంటే మంచిదని’ వ్యాఖ్యానించారు. తాము తొలి రోజే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు రూ.10 లక్షల ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు పాలించింది. ఆప్ 13 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఆ సమయంలో మీరు ఏం చేశారు….? ’ అంటూ ప్రశ్నించారు. మీ పాలనలో అనేక అవినీతి ఘటనలు వెలుగులోకి వచ్చాయంటూ ఆతిశీపై విరుచుకుపడ్డారు. ‘అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఢిల్లీ (Delhi) పరిపాలనకు సంబంధించి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదిక ప్రవేశపెట్టినప్పుడు.. అనేక మంది రహస్యాలు బయటపడతాయని వారు భయపడుతున్నారు’ అంటూ సీఎం రేఖా గుప్తా విలేకరులతో అన్నారు.
కాగా, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మన్జీందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, రవిందర్ ఇంద్రాజ్ సింగ్, పంకజ్ సింగ్ సైతం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం మొదటి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. ఆర్థిక, రెవెన్యూ శాఖలను సీఎం రేఖా గుప్తా తన వద్ద ఉంచుకున్నారు.
వచ్చే నెల నుంచే మహిళలకు 2,500
వికసిత్ ఢిల్లీ కోసం ఒక్క రోజు కూడా వృథా చేయకుండా తన ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేఖా గుప్తా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. గత పదేండ్లలో ఢిల్లీ ప్రజల సొమ్ముకు గత ఆప్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా మారుస్తామని తెలిపారు.
Also Read..
DK Shivakumar | ఆ దేవుడి వల్ల కూడా కాదు.. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యపై డీకే శివకుమార్ వ్యాఖ్య
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?
Mayawati: బీజేపీకి ‘బీ’ టీమ్‌లా కాంగ్రెస్.. రాహుల్‌కు మాయావతి కౌంటర్