RG Kar Hospital | కోల్‌కతా ( Kolkata) ఆర్జీకార్ వైద్య కళాశాల (RG Kar Hospital) ట్రెనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) కోల్‌కతా హైకోర్టుకు (Calcutta High Court) తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని పేర్కొంది. దర్యాప్తు సమయంలో సేకరించిన అన్ని ఆధారాలు, నిపుణుల అభిప్రాయాలు వైద్యురాలిపై జరిగింది సామూహిక అత్యాచారం కాదని సూచిస్తున్నాయని స్పష్టం చేసింది.
సీబీఐ తరఫున న్యాయవాది డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ ఘటనాస్థలం నుంచి సేకరించిన అన్ని డీఎన్ఏ నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులతో కూడిన 14 మంది సభ్యుల మెడికల్ బోర్డు ఈ పరీక్ష ఫలితాలను పరీక్షించిందన్నారు. ఏ ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారించలేదని స్పష్టం చేశారు. డీఎన్ఏ ప్రొఫైలింగ్ దోషిగా తేలిన నిందితుడు సంజయ్ రాయ్ ప్రమేయాన్ని మాత్రమే నిర్ధారించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు నాశనం చేయడంతో పాటు పలువురి అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ రాయ్‌ని ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది.
ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి శిక్ష ఖరారు చేసింది. అతడికి జీవితఖైదు (life term) విధిస్తూ ఈ ఏడాది జనవరి 20న తీర్పు వెలువరించింది. అతడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Encounter | సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి
Smartphones | స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యాం.. రోజుకు ఐదారు గంటలు సోషల్ మీడియాకే అంకితం
Studio Ghibli | ఘిబ్లీ సృజన అదరహో.. ప్రభంజనం సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ కొత్త ఫీచర్