Studio Ghibli | న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ స్టూడియో ఘిబ్లీ ఆన్లైన్లో మీమ్స్ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరుల ఏఐ జనరేటెడ్ చిత్రాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నారు. వీటిని ఘిబ్లీ ైస్టెల్ ఇమేజెస్ అంటున్నారు. ఈ ట్రెండ్‌ను ఒడిసి పట్టుకోవడానికి వ్యాపార సంస్థలు కూడా తమ కంటెంట్‌ను ఈ పద్ధతిలోనే ప్రమోట్ చేసుకుంటున్నాయి. బుధవారం విడుదలైన ఈ ఇమేజ్ జనరేటర్ ప్రముఖ జపనీస్ యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లీ’ స్ఫూర్తితో ఆర్ట్ వర్క్‌ను సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమ సృజనాత్మకతతో సృష్టించే కంటెంట్ ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నది.
ఎడారి వేడి గాలిని సూచించే లిబియన్ అరబిక్ పదం నుంచి ఘిబ్లీ అనే పదం వచ్చింది. జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీని 1985లో హయావో మియాజకి, ఇసావో టకహట, తోషియో సుజుకి స్థాపించారు. చేతితో గీచే యానిమేషన్, సంక్లిష్టమైన బ్యాక్గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఈ స్టూడియో ప్రసిద్ధి పొందింది. ఈ యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది.
ఈ ట్రెండ్ విపరీతంగా కొనసాగుతుండటంతో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ గురువారం మాట్లాడుతూ, యూజర్లు అత్యధికంగా ఘిబ్లీని వాడుతుండటంతో తమ కంపెనీ వనరులు ప్రభావితమవుతున్నాయని చెప్పారు. జీపీయూలు కరిగిపోతున్నాయన్నారు. ఈ ఫీచర్‌కు తాత్కాలికంగా స్పీడ్ లిమిట్స్ పెడుతున్నట్లు తెలిపారు. ఈ ఇమేజ్ జనరేటర్‌ను ఉచితంగానే అందించనున్నట్లు ఆయన మొదట్లో ప్రకటించారు.