Smartphones | న్యూఢిల్లీ, మార్చి 28: భారతీయుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. రోజుకు ఐదారు గంటలు సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఈవై విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024లో భారతీయులు గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్ఫోన్లపైన వెచ్చించే ఐదు గంటల్లో దాదాపు 70 శాతం సమయాన్ని సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్కే కేటాయిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. మొట్టమొదటిసారి డిజిటల్ ప్లాట్ఫారాలు టెలివిజన్ను కూడా అధిగమించిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.
భారతీయుల ఆన్లైన్లో గడుపుతున్న సమయం పెరుగుతుండడంతో మెటా, అమెజాన్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాల మధ్య పోటీ కూడా పెరుగుతోంది. ఒకపక్క డిజిటల్ మీడియా వ్యాపారం విస్తరిస్తుండగా టెలివిజన్, ప్రింట్, రేడియో వంటి సంప్రదాయ మీడియా రెవెన్యూ, మార్కెట్ వాటా 2024లో దిగజారడం గమనార్హమని ఆ నివేదిక వెల్లడించింది.