కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 29: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది (Encounter).. పచ్చటి ప్రకృతి వనంలో నెత్తుటేర్లు పారాయి. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన భీకర పోరులో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా గోగుండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, డీఆర్జీ భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి తారాసపడిన మావోయిస్టులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. అప్పటికే ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా దళాలు నలుదిక్కులా చుట్టూ ముట్టి ఎదురుకాల్పులను ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య విడతలవారీగా ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల్లో డీవీసీఎం జగదీశ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 20 మృతదేహాలను స్వాదీనం చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. భద్రతా బలగాల కాల్పుల్లో మరికొందరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఆపరేషన్ ‘కగార్’లో భాగంగా దండకారణ్యంలో మావోయిస్టుల వేట కొనసాగుతున్నది. ఇటీవల ఛత్తీస్గఢ్ జిల్లాల్లో జరిగిన పలు ఎన్కౌంటర్లను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నక్షలిజాన్ని తుద ముట్టించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాలు రచించినట్టు అవగతమవుతుంది. బస్తర్ రేంజ్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు సుమారు 100 కి పైగానే మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సుకుమా జిల్లాలో కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.