Madhya Pradesh : దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు, ఒక్కోసారి సాటి మనిషికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకురారు అని చాటేందుకు ఈ ఘటన మరో నిదర్శనం. అంబులెన్స్‌కు డబ్బులు లేక మధ్యప్రదేశ్‌లో ఒక వృద్ధుడు తన భార్యను తోపుడు బండిపై ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె మార్గమధ్యలోనే మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో శనివారం జరిగింది.
యూపీకి చెందిన పవన్ సాహూ అనే వృద్ధుడు తన భార్యతో కలిసి మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా పరిధిలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయితే, తన దగ్గర ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు లేవు. అంబులెన్సుకు డబ్బులు లేకపోవడంతో తనకు తెలిసిన స్థానికుల్ని సాయం అడిగాడు. అయినా, ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. తన భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తనే కూరగాయలు అమ్మే తోపుడు బండిపై ఉంచుకుని, ఆస్పత్రికి బయల్దేరాడు. మధ్యమధ్యలో కూడా సాయం కోసం అర్థించాడు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో కొంత దూరం వెళ్లిన తర్వాత మఠా మదియా అనే ప్రాంతంలో, నడిరోడ్డు మీద, తోపుడు బండిపైనే అతడి భార్య ప్రాణాలు కోల్పోయింది.
తన జీవిత భాగస్వామి మరణించడంతో అతడు తీవ్ర వేదనకు గురయ్యాడు. అతడు రోదించిన తీరు అక్కడివారి కళ్లు చెమర్చేలా చేసింది. ఈ పరిస్థితుల్లో తను ఏం చేయాలో తెలియక అతడు అలాగే ఉండిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అప్నా సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థ అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అతడి భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనపై స్థానిక వైద్యాధికారులు స్పందించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, వృద్ధుడికి అవసరమైన సాయం అందిస్తామని అధికారులు తెలిపారు. ఇక్కడ.. అందరినీ ఆలోచింపజేస్తున్న కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. అతడి పేదరికంతోపాటు.. తోటివారెవరూ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
డబ్బు సాయం చేయకపోయినా.. కనీసం ఒక ఫోన్ కాల్ ద్వారా అధికారులకు సమాచారం అందించి అయినా సాయం చేయలేకపోయారు. మరోటి.. అతడి నిరక్షరాస్యత, అవగాహనా లేమి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాయం అందే అవకాశం ఉంది. కానీ, అతడు చదువుకోకపోవడం, వీటిపై అవగాహన లేకపోవడం వల్ల ఎవరినీ అభ్యర్థించలేకపోయాడు. ప్రభుత్వ వ్యవస్థల్ని సంప్రదించలేకపోయాడు.