న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో రైల్వేకు అధిక ప్రాధానత్య ఇచ్చారు. 2022-23 బడ్జెట్లో రైల్వేకు రూ. 1.4 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి అత్యధిక నిధులు కేటాయించారు. 2023-24 బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.2.4 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2013-14లో నాటి యూపీయే ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే 9 రెట్లు ఎక్కువ అని బుధవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. రైళ్లు వేగంగా వెళ్లేందుకు కొత్త రైలు పట్టాల ఏర్పాటు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి మరిన్ని స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను కూడా తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వెల్లడించారు. కాగా, రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో వెయ్యికిపైగా కోచ్‌లను పునరుద్ధరించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
మరోవైపు ప్రధానంగా రైల్వే సరకు రవాణాకు ఉపయోగపడే వంద క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం బడ్జెట్లో రూ.75,000 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటి పలు రంగాల అభివృద్ధి ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.