FASTag : ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)’ నూతన FASTag వార్షిక పాస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. తరచూ హైవేలను వినియోగించే వారికి టోల్ ఫీజు (Toll fee) చెల్లింపు ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ వార్షిక పాస్ (Anual pass) ను తీసుకొచ్చారు. ఈ పాస్ ఇంకా అందుబాటులోకి రానప్పటికీ.. ధర, వినియోగ పరిమితులు, చెల్లుబాటు లాంటి వివరాలతో NHAI దాన్ని తన అధికారిక వెబ్సైట్లో లిస్టు చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పాస్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించారు. అర్హత కలిగిన వినియోగదారులు ఒకేసారి రూ.3 వేల రుసుము చెల్లించి 200 టోల్-ఫ్రీ ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపలే 200 ట్రిప్పులు పూర్తయితే అంతటితో పాస్ చెల్లుబాటు ముగుస్తుంది. పాస్ పరిమితి అయిపోయిన తర్వాత FASTag ఎప్పటిలాగే సాధారణ పే ఫర్ యూజ్ సిస్టమ్‌కు తిరిగి వస్తుంది.
FASTag వార్షిక పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వాణిజ్య లేదా గూడ్స్ వాహనాల కోసం కాదు.
ఫాస్టాగ్ పాస్ అర్హత కోసం వాహనంలో యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాల్ చేయబడి ఉండాలి.
FASTagను కేవలం ఛాసిస్ నంబర్‌తో కాకుండా పూర్తి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)కి లింక్ చేయాలి.
FASTagను బ్లాక్‌లిస్ట్ చేయకూడదు, దానికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండకూడదు.
తాత్కాలిక నంబర్లు ఉన్న వినియోగదారులు దరఖాస్తు చేసుకునే ముందు వారి ఫాస్ట్‌ట్యాగ్ వివరాలను అపడేట్ చేయాలి.
NHAI నేరుగా నిర్వహించే టోల్ ప్లాజాలలో మాత్రమే పాస్ చెల్లుతుంది. రాష్ట్ర రహదారులు, ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రోడ్లు, రాష్ట్ర నిర్వహణ ఎక్స్‌ప్రెస్ వేలలో ఈ పాస్ చెల్లదు. పాస్ కొనుగోలు చేసేముందు వినియోగదారులు వారు రెగ్యులర్‌గా ప్రయాణించే రహదారులు NHAI అధికార పరిధిలోకి వస్తాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
ఆగస్టు 15 నుంచి వినియోగదారులు ‘రాజ్‌మార్గ్ యాత్ర’ మొబైల్ యాప్, NHAI అధికారిక వెబ్సైట్, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వెబ్సైట్ లాంటి అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయంలో మోసపోకుండా ఉండాలంటే థర్డ్ పార్టీ యాప్‌లు, వెబ్సైట్ల జోలికి వెళ్లొద్దు.
ముందుగా FASTag యాక్టివ్‌గా ఉందా లేదా..? చెల్లుబాటు అయ్యే VRNకి లింక్ చేయబడిందా లేదా..? అనేది నిర్ధారించుకోండి.
ఆ తర్వాత పైన పేర్కొన్న ఏదైనా అధికారిక ప్లాట్‌ఫామ్‌ను సందర్శించండి.
అక్కడ వాహనం, FASTag వివరాలను నమోదు చేయండి.
డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా రూ.3 వేల వన్-టైమ్ రుసుము చెల్లించండి.
ఆ వెంటనే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత SMS ద్వారా యాక్టివేట్ చేసుకోండి.