న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బుధవారం సాయంత్రం వెలువడ్డాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ, నిర్ణయాత్మక ఫలితాలను అంచనా వేశాయి. తమిళనాడులో డీఎంకే విజయ దుందుభి మోగించి మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు అనేక సంస్థలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నట్లు అంచనాలు సూచించాయి.
కేరళలో సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుండగా పుదుచ్చేరిలో సైతం బీజేపీ సారథ్యంలోని కూటమే విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఏర్పడినట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బీజేపీకే విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు అంచనా వేయగా పీపుల్స్ పల్స్, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోనున్నట్లు అంచనా వేశాయి.
తమిళనాడులో అధికార డీఎంకే వరుసగా రెండవ సారి అధికారాన్ని చేపట్టనున్నట్లు అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీతో చేతులు కలిపి బరిలోకి దిగిన అన్నాడీఎంకేకు మరోసారి ఓటమి తప్పదని సర్వేలు పేర్కొన్నారు. రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి ఎన్నికల పోరులో పాల్గొన్న సినీనటుడు విజయ్ సారథ్యంలోని టీవీకేకి రెండంకెల సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వేలు అంచనా వేశాయి.
కేరళలో అధికార ఎల్డీఎఫ్కు ఎదురుదెబ్బ తగలనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. విజయన్ నేతృత్వంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్కు ఈసారి పరాజయం తప్పేలా లేదని సూచించాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కు ఈ దఫా ఓటర్లు పట్టం కట్టినట్లు అంచనాలు తేల్చాయి.
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించనున్నట్లు సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ కూటమికి 88-100 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 24-36 స్థానాలు దక్కవచ్చని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 68-72, కాంగ్రెస్ కూటమికి 22-26 సీట్లు దక్కవచ్చని అంచనా.
పుదచ్చేరిలో బీజేపీ కూటమికే విజయావకాశాలు ఉన్నట్లు సర్వేలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ మే 4న వెలువడే తుది ఫలితాలు పార్టీలు, అభ్యర్థుల తలరాతను నిర్ణయించనున్నాయి.




