Gift : శివసేన ఎంపీ (Shiv Sena MP) కారు డ్రైవర్ (Car driver) కు నిజాం ప్రధాని సాలార్జంగ్ (Salar Jung) వారసులు రూ.150 కోట్ల విలువైన భూమిని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. శివసేన ఎంపీ సందీపన్ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ వద్ద జావెద్ రసూల్ షేక్ అనే వ్యక్తి గత 13 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉండే నిజాం దివాన్ వారసులు రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు.
ముజాహిద్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జావెద్‌కు గిఫ్టుగా ఇచ్చిన భూమి గురించి దివాన్ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని ముజాహిద్ తెలిపారు. అలాంటి భూమిని రక్తసంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్ డీడ్‌గా ఎలా ఇస్తారని ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు.
ఈ వివాదంపై జావెద్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దివాన్ వారసులతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే తనకు ఆ భూమిని రాసిచ్చారని అతడు పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించారని ఎమ్మెల్యే విలాస్ స్పష్టం చేశారు. అయితే ఈ భూమి బదిలీకి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తాను పోలీసులకు తెలిపానని ఆయన చెప్పారు.
దీనిపై సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ముజాహిద్ ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గిఫ్ట్ డీడ్‌పై సంతకం చేసిన వారితో పాటు సంబంధిత కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. డ్రైవర్‌కు, దివాన్ వారసులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.