Gold Prices | న్యూఢిల్లీ, జూన్ 27: గతకొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లలో మదుపరులు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటుండటం.. ఈ విలువైన మెటల్స్ మార్కెట్లను తిరోగమనం దిశగా నడిపిస్తున్నది. ఈ క్రమంలోనే శుక్రవారం తులం పసిడి ధర మరో రూ.930 క్షీణించింది. దీంతో న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.97,670కి పరిమితమైంది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. వరుసగా గత 6 రోజుల్లో ధర రూ.3,040 కోల్పోవడం గమనార్హం. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లిన మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం నెలకొనడం.. గోల్డ్, సిల్వర్ మార్కెట్ల పరుగులకు బ్రేక్ పడ్డైట్టెందని మార్కెట్ వర్గాలు తాజా సరళిని విశ్లేషిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం వార్తలూ మార్కెట్ సమీకరణాల్ని మార్చేశాయి.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పడిపోతున్నాయి. తులం 24 క్యారెట్ రేటు రూ.930 తగ్గి శుక్రవారం రూ.98,020గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.850 పడిపోయి రూ.89,850 వద్ద స్థిరపడింది. గత 6 రోజుల్లో 24 క్యారెట్ ధర రూ.2,730, 22 క్యారెట్ రేటు రూ.2,500 తగ్గిందని మార్కెట్ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ ఇన్నాళ్లూ మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత పెట్టుబడి సాధనాలైన గోల్డ్, సిల్వర్ వైపునకు తీసుకెళ్లారని.. కానీ ఇప్పుడు ఉద్రిక్తకర పరిస్థితులు చక్కబడుతుండటంతో తిరిగి ఇన్వెస్ట్మెంట్లను స్టాక్ మార్కెట్ల దిశగా పంపిస్తున్నారని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందువల్లే ధరల్లో ఈ మార్పు అని పేర్కొంటున్నారు. కొనుగోలుదారులు సైతం ధరలు ఇంకా పడిపోతాయేమోనని ఎదురుచూస్తున్నారని, దాంతో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని జ్యుయెల్లర్స్ అంటున్నారు. ఇక ఆషాఢ మాసం సెంటిమెంట్ కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.
వెండి ధరలూ..
బంగారంతోపాటు వెండి ధరలూ భారీగానే క్షీణిస్తున్నాయి. కిలో ధర శుక్రవారం ఢిల్లీలో రూ.100 తగ్గి రూ.1,03,000 వద్ద నిలిచింది. వరుసగా 5 రోజుల్లో రూ.5,200 దిగజారింది. సాధారణ కస్టమర్లతోపాటు పారిశ్రామిక, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోయిందని వర్తకులు చెప్తున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికొస్తే.. ఈ ఒక్కరోజే ఔన్స్ గోల్డ్ 43.45 డాలర్లు లేదా 1.31 శాతం క్షీణించి 3,284.40 డాలర్లకు దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడ్డీరేట్లను తగ్గించాలని చెప్తున్నా.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని, ఇంకొన్ని రోజులు వేచిచూసే ధోరణినే అవలంభిస్తామని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పట్లో వడ్డీరేట్ల కోతలకు ఛాన్స్ లేదన్న వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా మార్కెట్లో గోల్డ్ రేట్లకు కళ్లెం వేస్తున్నాయని అంటున్నారు.
ధరల పతనానికి కారణాలు