Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల బెజోస్ తన ప్రియురాలు 55 ఏళ్ల లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను వివాహం చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ (Venice) నగరంలో గల లాగూన్ ఐలాండ్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఎంతో విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, జోర్దాన్ రాణి సహా పలువురు హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు, జర్నలిస్ట్‌లు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకోసం శాంచెజ్ ఏకంగా 27 ఔట్ఫిట్లను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. వాటివిలువ లక్షల్లోనే అని సమాచారం. ఇక వీరి వివాహం నేపథ్యంలో వెనిస్ నగరం ప్రముఖులతో సందడిగా మారింది.
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన శాంచెజ్‌తో బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో 2023లో వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ సందర్భంగా బెజోన్ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.21కోట్లు) విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికా ఫ్లోరిడా (Florida)లోని ‘ఇండియన్ క్రీక్’ (Indian Creek) ఐలాండ్‌లో 68 మిలియన్ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్ రూమ్ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Also Read..
Taj Mahal | తాజ్ మహల్లో లీకేజీ.. ప్రధాన గుమ్మటానికి బీటలు?
Mobile App Vote | మొబైల్ యాప్‌తో ఓటింగ్.. దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో అమలు
Medicines | ఇక మందులూ మాట్లాడుతాయ్.. ఔషధాల లేబులింగ్‌లో కేంద్రం భారీ ప్రక్షాళన