న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: స్వచ్ఛమైన ఇంధన పరిష్కారంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పెట్రోల్‌లో ఇథనాల్ కలపాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నం దేశంలో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. దేశంలో పండించే దాదాపు అన్ని ఇతర పంటల కంటే ఎక్కువ నీటిని వినియోగించే మక్కజొన్న, చెరకు, దేశానికి అత్యంత ఇష్టమైన వరి వంటి పంటలే ఈ సమస్యకు మూలకారణం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం భారతదేశపు నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే దీనికి అవసరమైన ముడి పదార్థాలైన చెరకు, ఇటీవల కాలంలో పెరుగుతున్న మక్కజొన్న పండించడానికి, శుద్ధి చేయడానికి అత్యధికంగా నీరు అవసరం అవుతుంది అని ఐపీసీసీ రచయిత్రి అంజల్ ప్రకాశ్ అన్నారు.
దిగుమతి చేసుకునే ముడి చమురుపై దేశం ఆధారపడడాన్ని తగ్గించడానికి పెట్రోల్‌లో ఇథనాల్ అనే మొక్కల ఆధారిత ఆల్కహాల్‌ను కలపడాన్ని ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా భారత్ విస్తరిస్తుండగా దీనికి బియ్యం ఒక కీలక ముడిసరుకుగా మారింది. 2024-25లో ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి కోసం 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించగా ఇప్పుడు 2025-26లో 90 లక్షల టన్నులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన ధాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు పంపిణీ చేసే నూకల వాటాను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించి ఆదా అయిన మొత్తాన్ని ఇథనాల్ బ్లెండింగ్ సులభతరం చేయడానికి ఉపయోగపడేలా నేరుగా డిస్టిలరీలకు మళ్లించాలని నిర్ణయించింది.
ఢిల్లీలో 2024లో జరిగిన ఒక ప్రపంచ సదస్సులో ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ఈ డాటాను పంచుకున్నారు. బియ్యం నుంచి ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సాగు సమయంలో నీటిపారుదల కోసం ఉపయోగించే నీటితో సహా సుమారు 10,790 లీటర్ల నీరు అవసరం అవుతుందని ఆయన చెప్పారు. పోల్చి చూస్తే ఒక లీటరు ఇథనాల్‌కు మక్కకు సుమారు 4,670 లీటర్లు, చెరకుకు దాదాపు 3,630 లీటర్లు అవసరం. దీన్ని మరోలా చెప్పుకుంటే ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరం కాగా ఒక టన్ను బియ్యం నుంచి కేవలం 470 లీటర్ల ఇథనాల్ మాత్రమే లభిస్తుంది. దీనివల్ల బియ్యం ఇంధన వనరులలో కెల్లా అత్యంత ఎక్కువ నీటిని వినియోగించే వాటిలో మొదటిగా నిలుస్తుంది.
ఇథనాల్ మిల్లులు భారీ పరిమాణంలో వ్యర్థ జలాలను(వినాస్సే) కూడా ఉత్పత్తి చేస్తాయి. వీటిని సక్రమంగా శుద్ధి చేయకపోతే ఉపరితల, భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది అని అంజల్ ప్రకాశ్ అన్నారు. ఈ కథనాన్ని మొదటగా కిసాన్ తక్ సంపాదకుడు ఓం ప్రకాశ్ వెలుగులోకి తెచ్చారు. ఆయన ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. ఒక రైతు 1 కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 నుంచి 5,000 లీటర్ల నీటిని వినియోగించినపుడు వనరులు తగ్గిపోతున్నాయంటూ వారినే నిందిస్తారు. అయినప్పటికీ కేవలం ఒక లీటర్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి పరిశ్రమలు 10,000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తాయి అని ఓం ప్రకాశ్ పేర్కొన్నారు. నీటి సంక్షోభానికి పరిశ్రమను ఎప్పుడూ నిందించరని ఆయన అన్నారు.