Nepali Student | ఒడిశాలోని భువనేశ్వర్‌లో గల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్)లో నేపాలీ విద్యార్థుల (Nepali Students) వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల క్రితం ఓ విద్యార్థిని కీట్ వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే అలాంటి ఘటనే ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. కీట్ (KIIT)లో కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రిషా షా (21) గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది.
నేపాల్ రాజధాని కఠ్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్‌గంజ్‌కు చెందిన ప్రిషా క్యాంపస్‌లోని 4వ వసతి గృహంలో ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రిషా హాస్టల్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గుర్తించిన హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భువనేశ్వర్ ఇన్ఫోసిటీ ఠాణా పోలీసులు, డీసీపీ జగ్మెహన్ మీనా, తదితర అధికారులు వర్సిటీకి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే విద్యార్థిని మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. కాగా, 90 రోజుల వ్యవధిలోనే కీట్‌లో నేపాలీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో ఘటన. ఈఏడాది ఫిబ్రవరి 16వ తేదీన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read..
Air India | పాక్ ఆంక్షలు.. ఎయిర్ ఇండియాకు రూ.వేల కోట్ల నష్టం..!
JD Vance | ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలి.. పాక్‌కు జేడీ వాన్స్ సూచన
Matka Queen: గ్యాంబ్లింగ్ సెంటర్లపై దాడులు.. మట్కా క్వీన్ జయా చెడ్డపై కేసు నమోదు