పనాజీ: గోవాలో గ్యాంబ్లింగ్ సెంటర్లపై పోలీసులు రెయిడ్ చేశారు. ఆ తనిఖీల్లో పలువుర్ని అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్న ముఠాపై కేసు బుక్ చేశారు. ముంబై మట్కా క్వీన్(Matka Queen) జయా చెడ్డపై కూడా కేసు బుక్కైంది. గోవా పోలీసుల కథనం ప్రకారం.. క్రైం బ్రాంచీ పోలీసులు పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. పనాజీ, మపూస, పర్వోరియం, మార్గోవా, వాస్కో, పోండా, మండ్రెమ్, పెర్నామ్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మొత్తం 12 కేసుల్ని నమోదు చేశారు. 12 మంది బుకీలను కూడా అరెస్టు చేశారు.
బెట్టింగ్, లాటరీలను నిర్వహించే ఆపరేటర్లపై కేసులు నమోదు చేశారు. చందూబాయ్ టక్కర్, గనేశ్యామ్ భాయ్, జయా చెడ్డాపై కేసు బుక్ చేశారు. ముంబై కేంద్రం మట్కా క్వీన్ జయా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది. మట్కా కింగ్ సురేశ్ భగత్ భార్యే జయా చెడ్డ. ముంబై నుంచి జయా తన మట్కావ్యాపారాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు క్రైం బ్రాంచీ పోలీసులు వెల్లడించారు. ఇక టక్కర్, గనేశ్యామ్లు గుజరాత్ డీలర్లుగా ఉన్నారు.