Nepal Airlines : భారత్ (India) కు నేపాల్ ఎయిర్‌లైన్స్ (Nepal Airlines) క్షమాపణలు చెప్పింది. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా (Social Media) లో ఒక పోస్టు చేసింది. దానిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నెటిజన్ (Netizens) లు కూడా నేపాల్ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు గుప్పించారు. దాంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ నష్టనివారణ చర్యలకు దిగింది. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియా నుంచి పోస్టును తొలగించింది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం నేపాల్ ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను పాకిస్థాన్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ కాగా.. భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతలోనే ‘బాయ్‌కాట్ నేపాల్ ఎయిర్‌లైన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా తెర పైకి వచ్చింది. భారత విదేశాంగశాఖ, విమానయాన మంత్రిత్వ శాఖలు నేపాల్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.
భోజ్‌పుర్ నటుడు, గాయకుడైన ఖేసరిలాల్ యాదవ్ కూడా ఈ చర్య రెచ్చగొట్టేదిగా ఉందని ట్వీట్ పెట్టారు. దాంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని నేపాల్ ఎయిర్‌లైన్స్ పోస్టును డిలీట్ చేసింది. తాము పోస్టు చేసిన మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించిన విషయాల్లో తప్పులు జరిగాయని అంగీకరిస్తూ.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జరిగిన తప్పిదంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.