Rahul Gandhi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: దేశంలో నిరుద్యోగ సమస్యను ఎన్డీఏతో పాటు యూపీఏ సైతం పరిష్కరించలేకపోయాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంగీకరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చలో సోమవారం ఆయన లోక్సభలో మాట్లాడారు. ‘ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందినప్పటికీ మనం నిరుద్యోగ సమస్యను సరిగ్గా పరిష్కరించలేకపోయాం. దేశ యువతకు ఉద్యోగాల విషయంలో యూపీఏతో పాటు ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వలేకపోయాయి’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తయారీ రంగంలో 2014లో భారతదేశ వాటా 15.3 శాతం ఉండగా, ఇవాళ 12.6 శాతానికి తగ్గిపోయిందని, ఇది 60 ఏండ్ల కనిష్ఠమని ఆయన అన్నారు. తాను ప్రధాని మోదీని బదనాం చేయడం లేదని, ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పడం న్యాయం కాదని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ మంచి ఆలోచనే అయినప్పటికీ ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాల జాబితా మాత్రమే ప్రసంగంలో ఉందని అన్నారు.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో తయారీ రంగం బలంగా ఉంటే, సాంకేతికతలపై మనం పని చేస్తూ ఉంటే మన ప్రధానమంత్రికి ఆహ్వానం తెచ్చేందుకు మూడుసార్లు అమెరికాకు విదేశాంగ శాఖ మంత్రిని పంపాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడే వచ్చి ప్రధానిని ఆహ్వానిస్తారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై హక్కుల తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నది. రాహుల్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని మంత్రి జైశంకర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తన పర్యటనలో ఆహ్వానాల గురించి ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట అంశం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి, ఈ దుర్ఘటనపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు లోక్సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతుల జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొంతసేపు సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఎస్పీ ఎంపీలు తర్వాత సభకు హాజరయ్యారు. ‘ఇప్పటికీ తొక్కిసలాటలో ఎంత మంది మరణించారనే సంఖ్య తెలియదు’ అని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. ‘మార్చరీలో ఉన్న మృతదేహాల సంఖ్యకు, ఘటనలో ఆచూకీ కోల్పోయిన వారి సంఖ్యకు మధ్య తేడా ఉంది’ అని తృణమూల్ ఎంపీ కకోలీ ఘోష్ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను చైర్మన్ జగ్దీప్ ధన్కడ్ తిరస్కరించారు. దీంతో విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.