ముంబై, ఆగస్టు 22 : వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కొందరు నేతల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీల్లో అశాంతి నెలకొని ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఈ రెండు రాష్ర్టాల ఎంపీలు విపక్ష అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపవచ్చునని ఎన్డీఏ భయపడుతున్నదన్నారు. పేపర్‌పై ఎన్డీఏ పటిష్ఠంగా ఉన్నట్టు కన్పిస్తున్నా, వారిలో ఆత్మవిశ్వాసం లేదని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (యూబీటీ)లను కోరడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏ పార్టీలనైతే చీల్చారో ఇప్పుడు వాటినే బీజేపీ మద్దతు కోరుతున్నదని విమర్శించారు.