ముంబై: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆమె ఇండియా కూటమిలో ప్రధాన నేతలైన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌లను ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడాన్ని విమర్శించారు.
అలాగే 1975-77 నాటి ఎమర్జెన్సీకి తాము మద్దతు ఇవ్వకపోయినప్పటికీ జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్‌గా నిర్వహించాలంటూ మోదీ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను సాధించిందని ఆమె ప్రశంసిస్తూ ఆట మొదలైందని, అది కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.