ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజీనామాను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స్వాగతించింది. గవర్నర్ పదవికి కోశ్యారీ కళంకం తీసుకువచ్చారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ రాజ్యాంగవిరుద్ధ సర్కార్ కొలువుదీరేలా వ్యవహరించారని ఆ పార్టీ మండిపడింది. గవర్నర్ మార్పుకు మహా వికాస్ అఘడి ఎప్పటినుచో డిమాండ్ చేస్తోందని ఎన్సీపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.
మహారాష్ట్రకు నూతన గవర్నర్‌ను నియమించాలన్న తమ ఆకాంక్ష నెరవేరడంతో కోశ్యారీ రాజీనామాను స్వాగతిస్తున్నామని ఎన్సీపీ పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.
అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించగా, ప్రస్తుత గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ కోశ్యారీని ఛత్తీస్‌గఢ్‌కు పంపించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్ బైస్ను నియమించింది. వీరితోపాటు ఛత్తీస్‌గఢ్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్లకు స్థానచలనం కలిగింది.