Baba Siddique | ముంబై : ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీపై ముగ్గురు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కాల్పులకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే అని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు బిష్ణోయ్ గ్యాంగ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్నారు.
సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని కర్నైల్ సింగ్(హర్యానా), ధరమ్ రాజ్ కశ్యప్(ఉత్తరప్రదేశ్) గా గుర్తించారు. సిద్ధిఖీని హత్య చేసేందుకు గత నెల రోజుల నుంచి బాంద్రాలోని ఆయన కుమారుడి ఇంటి వద్ద దుండగులు రెక్కీ నిర్వహించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది.
ముగ్గురు దుండగులు బాంద్రాకు ఆటోలో వచ్చారు. సిద్దిఖీ రాక కోసం వారు కొంతసేపు ఎదురుచూశారు. ఇక సిద్ధిఖీ రాగానే మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే సిద్ధిఖీ కదలికలపై దుండగులకు మరో వ్యక్తి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే సిద్ధిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా..? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ నుండి బెదిరింపులు అందుకున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహితంగా ఉండటం వల్ల, ఈ హత్య వెనుకాల బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నార. అయితే సిద్ధిఖీ గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ఎటువంటి బెదిరింపులను అందుకోలేదు. కాకపోతే 15 రోజుల క్రితం తనకు ప్రాణహాని ఉందని, తనకు వై కేటగిరీ భద్రత కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు సిద్ధిఖీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
Baba Siddique | మహారాష్ట్రలో దారుణం.. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య
GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత
India vs Bangladesh | బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్