Ex-Professor GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (GN Saibaba) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను 2014లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదేళ్లపాటు నాగ్‌పూర్ జైలులోనే ఉన్న ఆయన ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యారు.
సాయిబాబాకు సెప్టెంబర్ 28వ తేదీన గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరుగగా.. ఈ ఆపరేషన్‌లో ఆయన గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. దీంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇక శనివారం ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని, అంతర్గత రక్తస్రావంతోపాటు పొత్తికడుపులో వాపుతో ఆయన బాధపడ్డారని, బీపీ పడిపోయిందని డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాయిబాబా కోలుకోలేకపోయారని సమాచారం.
మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో అరెస్టయ్యి నాగ్‌పూర్ జైల్లో జీవితఖైదు అనుభవించిన విషయం తెలిసిందే. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నారని ఆరోపిస్తూ 90% వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబాను, మరో ఐదుగురిని 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు చేసింది. ఈ కేసు విచారణ జరిపిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో నిందితులకు జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పుర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబర్‌లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది.
అనంతరం 2023 ఏప్రిల్‌లో మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. వారి అప్పీల్‌పై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని మహారాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నేడు తీర్పు వెలువరించింది. కాగా అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తీసేసింది.