Naveen Patnaik | ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు బీజేపీ (BJP) ఎట్టకేలకు అడ్డుకట్ట వేయగలిగింది. మంగళవారం వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేడీ (BJD) ఓడిపోయింది. ఈ సందర్భంగా ఓటమిపై నవీన్ పట్నాయక్ తొలిసారి స్పందించారు. పార్టీ 24 ఏళ్ల పాలనపై సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. తన పాలనలో రాష్ట్రం అనేక మైలురాళ్లను సాధించిందన్నారు.
బుధవారం సాయంత్రం ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. ‘నేను తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒడిశాలో 70 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 శాతానికి చేరింది. వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. పాలనలో మంచి పనితీరు కనబరచడంతోనే ఇప్పుడు రాష్ట్రం ఈ స్థాయిలో ఉంది. గత 24 ఏళ్ల మన ప్రభుత్వ పాలనపై సిగ్గుపడటం లేదు. ఇన్నాళ్లూ ప్రజల కోసం పనిచేశాం. ఇకపై కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఓటమి గురించి బాధపడాల్సిన అవసరం లేదు’ అని నవీన్ పట్నాయక్ అన్నారు.
కమలం చేతిలో ఓటమి
2000లో ఒడిశా సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 24 ఏండ్ల పాటు సీఎంగా కొనసాగి చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ రికార్డుకు బ్రేక్ పడింది. 147 స్థానాలు గల ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లలో విజయఢంకా మోగించింది. బీజేడీ మాత్రం 51 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన నవీన్ పట్నాయక్ ఒక్క స్థానంలోనే విజయం సాధించారు. కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఎం ఒకటి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
నవీన్ పట్నాయక్ పొలిటికల్ హిస్టరీ ఇదే..!
జనతాదళ్ నేత బిజూ పట్నాయక్ తనయుడే నవీన్ పట్నాయక్. బిజూ పట్నాయక్ కూడా ఒడిశా సీఎంగా పని చేసినా.. తండ్రి హయాంలో రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు నవీన్ పట్నాయక్. కవిగా జీవనం సాగిస్తున్న నవీన్ పట్నాయక్.. తన తండ్రి మరణం తర్వాత 1997లో బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1998లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో బీజేడీ గెలుపొందడంతో నవీన్ పట్నాయక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, తొలిసారి సీఎంగా ప్రమాణం చేశారు. నాటి నుంచి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు.
సీఎం పదవికి పట్నాయక్ రాజీనామా
అయితే 2024లో మాత్రం పరాజయాన్ని చవిచూసిన నవీన్ పట్నాయక్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రఘుబర్ దాస్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అక్కడికి వచ్చిన జర్నలిస్టులకు చేయి ఊపి వెళ్లిపోయారు. ఇక రాష్ట్రానికి తదుపరి సీఎం ఎవరన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ ఏర్పడింది.
బీజేపీ తొలి ముఖ్యమంత్రి ఎవరు?
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, తొలిసారి ఆ రాష్ట్ర గడ్డపై అధికారాన్ని చేపట్టబోతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తొలి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అన్న ఉత్కంఠ కలుగుతున్నది. కేంద్ర మాజీ మంత్రి జౌల్ ఓరమ్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని సీఎం పీఠం వరిస్తుంది? లేక కొత్త వారికి అవకాశం దక్కుతుందా? అన్నది తేలాల్సి ఉన్నది.
Also Read..
Thank you very much Amma!.. ఎన్టీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన చంద్రబాబు
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
PM Modi | మోదీ ప్రమాణ స్వీకారం.. దక్షిణాసియా అగ్రనేతలకు ఆహ్వానం