Narendra Modi : పశ్చిమాసియా యుద్ధం తీవ్రతతో దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, ముడి చమురు కొరత వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ నిల్వలు, విద్యుత్, ఎరువులు సరిపోను ఉన్నాయా? లేదా? అనే అంశంపై కేంద్ర మంత్రులతో ఆదివారం ప్రధాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసరాలైన గ్యాస్, విద్యుత్, ఎరువుల పంపిణీలో అంతరాయం లేకుండా చూడాలని మోడీ సూచించారు.
మూడు వారాలకు పైగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో భారత్ ఇంధన కొరత, గ్యాస్ సరఫరాపై అనిశ్చితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశ ప్రజల్లోని భయాలను తొలగించాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇంధన భద్రత, సరిపోను నిల్వలు ఉండేలా చూసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించడం వంటి వాటిపై దృష్టి సారించారు.
#BREAKING | PM Modi chairs high‑level meeting to assess preparedness across key energy and fertiliser sectors as West Asia tensions grow
NDTV’s @himanshundtv reports pic.twitter.com/lGK2vnui3k
— NDTV (@ndtv) March 22, 2026
గ్యాస్, ముడి చమురు, విద్యుత్, ఎరువులు వంటి వాటిని నిరంతర సరఫరా చేయడం, వీటి పంపిణీలో అలసత్వం ప్రదర్శించకూడదనే అంశాలపై కేంద్ర మంత్రులతో మోడీ చర్చించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ అత్యవసర భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖామాత్యులు ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు.
అత్యవసర సమావేశంలో మంత్రి వర్గంతో చర్చించిన మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి మధ్యంతర చర్యల్లో భాగంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచింది. విద్యా కేంద్రాలు, ఆస్పత్రులకు గ్యాస్ పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. గృహోపయోగానికి, కమర్షియల్ వినియోగదారులకు కొత్తగా పీఎన్జీ(పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.