న్యూఢిల్లీ: గత ఏడాది జూన్ 9న వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కి మించి సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. కేవలం 240 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. గత రెండు పర్యాయాలు ఏకఛత్రాధిపత్యం సాగించిన మోదీ సర్కారు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సంకీర్ణ డిమాండ్లకు తలొగ్గింది. ఏడాది పాలనలో ఐదుసార్లు తన నిర్ణయాలపై యూటర్న్ తీసుకున్నది. ఈ మేరకు ది వైర్ ఓ కథనం ప్రచురించింది.
కులగణన
జనాభా లెక్కల సేకరణతో కులగణనను చేర్చుతున్నట్లు ఏప్రిల్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం 2024 ఎన్నికల ప్రచారంలో బీజేపీ తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నమైనది. కుల గణన డిమాండును కొట్టివేసిన బీజేపీ అది సమాజాన్ని చీల్చే ప్రయత్నమని పేర్కొంది. గత వారం జనాభా లెక్కల సేకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2026 అక్టోబర్ 1న ప్రారంభించి రెండు విడతలుగా జన, కుల గణన నిర్వహిస్తామని తెలిపింది.
లాటెరల్ ఎంట్రీ
45 కీలక పోస్టులకు లాటరల్ నియామకాలు చేపట్టేందుకు జారీచేసిన ప్రకటనను ఉపసంహరించుకోవలసిందిగా యూపీఎస్సీని గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతిపక్షాలతోపాటు ఎన్డీఏలోని సొంత మిత్రపక్షాల ఒత్తిడికి తలవొగ్గే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
యూనిఫైడ్ పింఛన్ పథకం
నేషనల్ పింఛన్ పథకం(ఎన్పీఎస్) రూపంలో 21 సంవత్సరాల క్రితం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకువచ్చిన పింఛన్ సంస్కరణల నిర్ణయాన్ని తిరగరాస్తూ గత ఆగస్టులోనే కేంద్ర క్యాబినెట్ యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని(యూపీఎస్) ఆమోదించింది.
దౌత్య ప్రచారానికి ప్రతిపక్షాల మద్దతు
గడచిన రెండు పర్యాయాలకు భిన్నంగా పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు ప్రతిపక్షాల మద్దతును కేంద్ర ప్రభుత్వం కోరింది. గడచిన రెండు పర్యాయాలు భారత విదేశాంగ విధానాన్ని మోదీ స్వయంగా రూపొందించుకోగా అందుకు భిన్నంగా ఆపరేషన్ సిందూర్‌పై దౌత్య ప్రచారం కోసం ప్రతిపక్షాల సహకారాన్ని మోదీ కోరారు.
పార్లమెంట్లో వెనుకడుగు
తన మొదటి రెండు పర్యాయాలలో వ్యవసాయ బిల్లులు, ఆర్టికల్ 370 వంటి వివాదాస్పద బిల్లులతోపాటు, రికార్డు స్థాయిలో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం వంటి అంశాలలో పార్లమెంట్లో ఏకపక్షంగా వ్యవహరించినట్లు విమర్శలు ఎదుర్కొన్న మోదీ ప్రభుత్వం మూడవ పర్యాయంలో వక్ఫ్ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించి తన గత వైఖరికి భిన్నంగా వ్యవహరించింది.