బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాలపాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అధికారం కోసం ఎంతోకాలంగా కలిసి ఉన్న మిత్రుడ్ని వదిలేసిందని ప్రధాని విమర్శించారు. తన రాజకీయ ఉనికి కోసం ఏదైనా చేసే ఓ పరాన్నజీవిగా కాంగ్రెస్ను అభివర్ణించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఆయా రాష్ర్టాల్లో ద్రోహపూరిత రాజకీయాలకు, పరిపాలనా వైఫల్యాలకు కాంగ్రెస్ ఓ నిదర్శనమని అన్నారు.
యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో పదేండ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించిందని అన్నారు. అలాంటి పార్టీని కాంగ్రెస్ కష్టసమయంలో వదిలేసిందని ఆరోపించారు. అధికారంపై ఉన్న దురాశతో స్టాలిన్ను వదిలి, టీవీకేతో చేతులు కలిపిందని దుయ్యబట్టారు. అంతర్గత కుమ్ములాటలతో కర్ణాటకలో సుపరిపాలన అందించటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. కాగా మోదీ కార్యక్రమం వేదికకు కూతవేటు దూరంలో రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యం కావటం కలకలం రేపింది.